శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 26, 2020 , 03:39:29

పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం

పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరంలోని దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం 40, 17వ డివిజన్లలో మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. మన చుట్టూ ఉన్న ప్రాంతాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఆలోచన ప్రజల్లో రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏండ్ల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులు, ప్రజలందరూ కలిసి డివిజన్లను సుందరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. 


ఈ పది రోజుల్లో ‘ప్లాన్‌ యువర్‌ వార్డు’ను సిద్ధం చేసుకోవాలన్నారు. డివిజన్లలో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్‌, మురికికాల్వలు, రోడ్లు ఇతర అన్ని సమస్యలను గుర్తించి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, పచ్చదనం పెంపునకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలకు నేరుగా నిధులు సమకూరుస్తుందన్నారు. పట్టణాల అభివృద్ధికి ఎక్కడా నిధులకు ఇబ్బంది లేదన్నారు. వార్డుల్లో ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్‌ సమస్యలన్నింటినీ ఈ కార్యక్రమంలో గుర్తించి పరిష్కరిస్తామన్నారు. ప్రతి డివిజన్‌లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు భూమాగౌడ్‌, కోల భాగ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.  


logo