శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 26, 2020 , 03:36:01

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

గంగాధర: రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. గంగాధర మండలం కురిక్యాల శివారులో ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్న స్థలాన్ని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, డీటీవో పుప్పాల శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ పరిశీలించారు. ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రధాన రహదారివెంట ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుకు రెండువైపులా మట్టికొట్టుకుపోయి టెంపర్‌ ప్రమాదకరంగా ఉందని పేర్కొంటూ సైడ్‌ బర్మ్‌లు పోయించాలన్నారు. ప్రమాద జోన్లను గుర్తించి వాహనాల వేగాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై తప్పనిసరిగా సూచిక బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రమాదకర మూలమలుపుల వద్ద వాహనదారులు జాగ్రత్తలు పాటించేలా చూడాలని చెప్పారు. గంగాధర నుంచి మొదలు హుజూరాబాద్‌ వరకు ప్రధాన రహదారికి రెండు వైపులా ముళ్ల పొదలను తొలగిస్తూ జంగల్‌ కటింగ్‌ చేపట్టాలని ఆదేశించారు. వారి వెంట తాసిల్దార్‌ జింక జయంత్‌, సీఐ రమేశ్‌, ఎస్‌ఐ తాండ్ర వివేక్‌, తదితరులు ఉన్నారు.


logo