గురువారం 28 మే 2020
Karimnagar - Feb 25, 2020 , 02:46:36

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలితిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ: తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్‌ కే శశాంక సూచించారు. సోమవారం రాత్రి తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి విద్యాసంస్థల 22వ వార్షిక వేడుకలను ‘యశోయాన్‌-2020’ పేరుతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుని అందులో రాణించాలని సూచించారు.  యువత అన్ని రంగాల్లో రాణించి దేశ సేవలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. ఇష్టంతో కష్టపడితే ఏదైనా సాధ్యమేననీ, విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే ఆలోచనాశక్తి పెరుగుతుందనీ, ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 22 ఏళ్ల జ్యోతిష్మతి విద్యాసంస్థలను క్రమశిక్షణ, అంకిత భావంతో ముందుకు నడపడం అంత ఆషామాషీ కాదనీ, విద్యాసంస్థల చైర్మన్‌కు చదువుపై ఉన్న మమకారంతోనే ఇది సాధ్యమవుతున్నదన్నారు.  


విద్యార్థులు కళాశాలలో వసతులను సద్వినియోగం చేసుకుని, దేశానికే గర్వకారణంగా రాణించాలన్నారు. గౌరవ అతిథి, నిట్‌ వరంగల్‌ ప్రొఫెసర్‌ ఆర్‌బీవీ సుబ్రమణ్యం మాట్లాడుతూ, సాంకేతిక నైపుణ్యం పెంచుకుంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని తెలిపారు. చదువుతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు మాట్లాడుతూ, మారుతున్న కాలానికనుగుణంగా తమ కళాశాల విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్ది ఉత్తర తెలంగాణలోనే గుర్తింపు కళాశాలగా తీసుకువచ్చామన్నారు.జ్యోతిష్మతి విద్యార్థులను సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. సమాజంలో బాధ్యత గల విద్యార్థులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దమే తమ కళాశాల లక్ష్యమన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ నికితాపంత్‌, కళాశాలల ప్రిన్సిపాళ్లు లక్ష్మీనారాయణ, వైశాలి, షణ్ముకకుమార్‌, డీన్‌ రామకృష్ణంరాజు, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి విశ్వప్రకాశ్‌బాబుతోపాటు వివిధ విభాగాల హెచ్‌వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo