శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 25, 2020 , 02:45:37

కలిసికట్టుగా పని చేస్తేనే ప్రగతి

కలిసికట్టుగా పని చేస్తేనే ప్రగతి

హుజూరాబాద్‌ నమస్తే తెలంగాణ/ జమ్మికుంట: కలిసికట్టుగా ప్రజలు, అధికారులు పని చేస్తేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. సోమవారం హుజూరాబాద్‌లోని 23, 29 వార్డులు, జమ్మికుంటలోని 21, 29 వార్డుల్లో సోమవారం నిర్వహించిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డుల్లో తిరుగుతూ, కాలనీవాసులను పలకరిస్తూ సమస్యల గురించి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ, పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకొని కాలనీల్లోని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. నిధులకు కొదువలేదనీ,   మురుగు కాలువలు, సీసీ రోడ్లను వేయించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అర్హులైన ప్రతీ నిరుపేద కుటుంబానికి త్వరలోనే డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, హుజూరాబాద్‌లోని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోకపోవడంపై కమిషనర్‌ జోనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంటలో రెండు వార్డుల్లోని కాలనీలన్నీ మంత్రి కలియదిరిగారు. 


స్థానిక కాలనీవాసులతో ముచ్చటించారు. అప్పటికప్పుడే సమస్యల పరిష్కారం కోసం ఆయా ప్రత్యేకాధికారులకు సలహాలు, సూచలను అందించారు. మొక్కలు నాటారు. జమ్మికుంట పట్టణ అభివృద్ధి కోసం రూ.40 కోట్ల నిధులున్నాయనీ, వీటితో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. సమస్యలపై నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. మట్టి రోడ్లు కనిపించకూడదనీ, ప్రగతిలో భాగంగా ప్రతి అధికారి, కౌన్సిలర్లు స్థానిక సమస్యలను వెంటనే గుర్తించాలనీ, వాటిపై ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. పట్టణానికి వేలాది మంది వస్తున్నారనీ, వారి కోసం నలుదిక్కులా తాగునీరు, టాయిలెట్లు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు.  చిరు వ్యాపారాల కోసం ప్రత్యేక షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. బస్టాండ్‌ను ఆధునికీకరిస్తామన్నారు. పట్టణానికి ప్రత్యేక టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల బృందాన్ని అందించాలనీ, అవసరమైతే ప్రైవేట్‌ అధికారులను నియమించాలని ఉన్నతాధికారలను ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రాద్‌లాల్‌, ఆర్డీవో బెన్‌షాలోం, చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌చైర్‌పర్సన్‌ నిర్మల, కౌన్సిలర్లు బొలుగు సృజన, మొక్క రమేశ్‌, ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ టీ రాజేశ్వర్‌రావు, కమిషనర్‌ అనిసూర్‌ రశీద్‌,  తాసిల్దార్‌ నారాయణ, జడ్పీటీసీ డాక్టర్‌ శ్యాం, వైస్‌ చైర్మన్‌ స్వప్న, మార్కెట్‌ చైర్మన్‌ శారద పాల్గొన్నారు.


logo