గురువారం 28 మే 2020
Karimnagar - Feb 25, 2020 , 02:50:37

‘పట్టణ ప్రగతి’తో కొత్త రూపు

‘పట్టణ ప్రగతి’తో కొత్త రూపు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ‘పట్టణ ప్రగతి’తో నగరాలు, పట్టణాలు కొత్తరూపు సంతరించుకుంటాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. నగరంలోని 6వ డివిజన్‌లో సోమవారం ఆయన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని 22, 29, 27, 9వ డివిజన్లలో పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో హరితహారం, నిరాక్షరాస్యత నిర్మూలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  సమస్యల గుర్తింపునకు ప్రతి డివిజన్‌లోనూ నాలుగు కమిటీలు వేశామనీ, ఒక్కొక్క దానిలో 15 మందితో కలిపి మొత్తం 60 మంది ఉంటారని వివరించారు. పది రోజుల్లో డివిజన్‌ అభివృద్ధికి ప్రణాళికతోపాటు నగరాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక  రూపొందిస్తామని చెప్పారు. నిధుల కొరత లేదనీ, గుర్తించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు.  విద్యుత్‌ సమస్యల పరిష్కారం, మంచినీటి సరఫరా, పారిశుధ్యం మెరుగుదలకు ప్రాదాన్యత ఇస్తున్నామని చెప్పారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో ‘పట్టణ ప్రగతి’ని కూడా విజయవంతం చేయాలని కోరారు. డివిజన్లవారీగా ‘ప్లాన్‌ యువర్‌ వార్డ్‌', ‘ప్లాన్‌ యువర్‌ సిటీ’ అనే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని వివరించారు. ఈ పది రోజుల్లో  ఏయే పనులు అవసరమున్నాయి?, అవసరమైన నిధులకు సంబంధించి ప్రణాళికలు వేస్తామన్నారు. 


ప్రణాళికలు రూపొందిస్తాం: కలెక్టర్‌

ప్రజలందరితో కలిసి డివిజన్లలో పారిశుధ్యం, వీధిదీపాలు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా మొదలగు అంశాలను పరిశీలించి, డివిజన్‌ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తామని కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు. పచ్చదనం, పారిశుధ్యం మెరుగయ్యేలా అన్ని చర్యలు చేపడుతామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే  నగరాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిదులు, ఆయా డివిజన్‌ కమిటీల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 


యాప్‌ ఆవిష్కరణ

నగరపాలక సంస్థ కార్యాలయంలో  ‘పట్టణ ప్రగతి’ యాప్‌ను  మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన సమస్యలకు సంబంధించిన ఫొటోలను ఈ యాప్‌లో పొందుపర్చుతారని పేర్కొన్నారు. నగరపాలక సంస్థలో 60 డివిజన్ల నుంచి అధికారులు పంపించిన సమస్యలను క్రోడికరించి డివిజన్‌, నగరాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తారని చెప్పారు.


logo