బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 24, 2020 , 01:40:56

ఇక ‘పట్టణ’ బాట..

ఇక ‘పట్టణ’ బాట..

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : నగరాలు, పట్టణాల్లో మొదటిసారిగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ముఖ్యంగా ఆయా వార్డుల్లోని సమస్యలను గుర్తించడంపైనే ప్రధాన దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా ఆయా వార్డులు, డివిజన్లలోని రోడ్లపై విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, పోల్స్‌, వైర్లను గుర్తించడం, పారిశుధ్య పనులను పరిశీలించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇలా అన్నింటినీ గుర్తించి నివేదికను సిద్ధం చేస్తారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్థానికంగా ఉండే వార్డు కమిటీల సభ్యులు, కార్పొరేటర్లతో కలిసి ప్రణాళికలు తయారు చేసి మున్సిపాలిటీలకు అందించాల్సి ఉంటుంది. ఈ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో తీసుకొని వచ్చే ఏడాదిన్నరలోగా పరిష్కరించే దిశగా పాలకవర్గాలు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. 


పది రోజుల కార్యక్రమాలు 

హరితహారం కార్యక్రమం నిర్వహించడానికి నర్సరీలు ఎన్ని ఉన్నాయి.. ఎన్ని కావాలి.

చెత్త సేకరణకు ఎన్ని వాహనాలున్నాయి. ఇంకా ఎన్ని కావాలి..

ఇళ్లలో తడి, పొడి చెత్త బుట్టలున్నాయా? లేవా? గుర్తించడం

పారిశుధ్య నిర్వహణలో రోడ్లు, మురుగుకాల్వలను శుభ్రం చేయడానికి కావాల్సిన మిషన్లున్నాయా?. ఇంకా ఎన్ని అవసరం ఉంటాయి. 

వార్డుల వారీగా లేని మౌలిక సదుపాయాలను గుర్తించడం.

మున్సిపాలిటీల వారీగా పారిశుధ్య సిబ్బంది ఎంత మంది ఉన్నారు. పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ఎంత మంది అవసరం అవుతారు. 

విలీన గ్రామాలు, కొత్త మున్సిపాలిటీల్లో ఉద్యోగుల విలీనం, బదిలీ, ఇతర కార్యక్రమాలు పూర్తి కాకపోతే ఎలా చేయాలి. 

మంచినీటి సరఫరా ఎలా ఉంది. నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి.

వార్డులోని రహదారుల పరిస్థితి ఎలా ఉంది. ఏయే పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆయా రోడ్లల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? గుర్తించాలి. 

నగరం, పట్టణంలో ప్రజలకు అనుగుణంగా శ్మశాన వాటికలు, ఖనన వాటికలు ఉన్నాయా?, సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. 

ఇంకా ఏం చేయాల్సి ఉంది. 


వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు ఎలా ఉన్నాయి? అక్కడి ప్రజలకు సరిపోతున్నాయా? ఇంకా కావాలంటే స్థలం ఉందా? కొత్త మార్కెట్లు ఏర్పాటు చేయటానికి ఉన్న అవకాశాలపై పరిశీలన చేయాలి. 

పబ్లిక్‌ టాయిలెట్స్‌, మహిళల టాయిటెల్స్‌ ఉన్నాయా? లేకపోతే కొత్తగా నిర్మాణం చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలి. 

వార్డుల్లో ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితి ఎలా ఉన్నాయి? క్లీన్‌ చేసిన తర్వాత మళ్లీ చెత్త వేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. 

వార్డుల్లో వంగిన, తుప్పు పట్టిన విద్యుత్‌ స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్స్‌, ఇళ్లపై వేలాడే వైర్లు ఉన్న వాటిని గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం.


అభివృద్ధి కోసం చేయాల్సినవి..

నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావడానికి వీలుగా ఈ కార్యక్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇందులో భాగంగానే పట్టణ ప్రజలకు, పట్టణాలకు వచ్చే ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్‌ టాయిలెట్లును ఏర్పాటు చేయాలి. 

స్ట్రీట్‌ వెండర్స్‌ కోసం సరైన మౌలిక సదుపాయాలను కల్పించి అక్కడే అమ్మకాలు జరిగేలా చూడాలి. రోడ్లపై అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. 

ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజా, సరకు రవాణా వాహనాలకు నిర్ధిష్టమైన ప్రదేశాల్లో పార్కింగ్‌ సదుపాయం కల్పించాలి. 

ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రోడ్లపై ఎక్కడా విద్యుత్‌ పోల్స్‌ ఉండకుండా చర్యలు చేపట్టాలి. ఉన్న వాటికి రక్షణ చర్యలు తీసుకోవాలి. 

ప్రతి వీధిలో అత్యధిక సంఖ్యలో వృక్షాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దీని కోసం రోడ్లకు ఇరువైపులా స్థలాలను గుర్తించడంతో పాటు... ఖాళీ స్థలాలు, ఇళ్లలో మొక్కలు పెంచే విధంగా ప్రజల్లో అవగహన కల్పించాలి.పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా చూడాలి. అలాగే ప్రతి ఇంటి నుంచి సేకరించే తడి, పొడి చెత్తను వేర్వురుగా అందించేలా ప్రజల్లో అవగహన పెంచాలి.

డంప్‌ యార్డుల్లో చెత్త పేరుకపోకుండా రీైస్లెక్లింగ్‌పై అధునాతన సాంకేతికను వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలి. 

ఆరోగ్యకరమైన వాతారవణంలో ఉండేలా మార్కెట్లు, నాజ్‌ వేజ్‌ మార్కెట్లను నిర్మించే విషయంలో దృష్టి సారించాలి.

రోడ్లపై ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఆక్రమణలను తొలగించడంతో పాటు, పాదచారులకు ఫుట్‌పాత్‌ నిర్మాణాలు చేపట్టాలి.

ప్రారంభించనున్న మంత్రులు ఈటల, గంగుల 

హుజూరాబాద్‌, కరీంనగర్‌లో చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించనున్నారు. హుజూరాబాద్‌లోని 23, 29వ వార్డులో ఉదయం 7 గంటలకు మంత్రి ఈటల, నగరంలోని 6వ డివిజన్‌లో మంత్రి గంగుల ప్రారంభించనున్నారు. దీంతో పాటు నగరంలోని 9, 22వ డివిజన్లలో నిర్వహించే కార్యక్రమాల్లోనూ మంత్రి గంగుల పాల్గొంటారు.logo