గురువారం 04 జూన్ 2020
Karimnagar - Feb 24, 2020 , 01:35:15

నారాయణపూర్‌లో జలహారతి

నారాయణపూర్‌లో జలహారతి

గంగాధర: మండలంలోని నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు ఎల్లంపల్లి పైపులైన్ల ద్వారా నీటి విడుదల సందర్భంగా ఆదివారం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ జలహారతి నిర్వహించారు. పంపులవద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య పసుపు, కుంకుమలతో పాటు పుష్పాలు సమర్పించి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. జలహారతి ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గంలో పంటలను రక్షించేందుకు నీళ్లిచ్చి ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల పాలిట దేవుడని కొనియాడారు. ఇటీవల జిల్లాకు సమీక్షా సమావేశానికి వచ్చిన సందర్భంగా తాము చేసిన విజ్ఞప్తి మేరకు నీటి విడుదల కోసం వెంటనే ఆదేశాలు జారీచేశారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నాడు సమైక్య రాష్ట్రంలో నియోజకవర్గంలో కనీసం తాగుదామంటే నీటికి కరువుండేదన్నారు. సాగు చేయడానికి చుక్క నీరులేక ఇక్కడి రైతన్నలు అరిగోసపడ్డారని గుర్తుచేశారు. ఇక కూలిపని కూడా లభించక అనేక మంది వలస వెళ్లే వారని ఆవేదన వ్యక్తంచేశారు. 


తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిస్థితి మారిందన్నారు. సముద్రంలో కలిసే నీటిని వందల మీటర్ల ఎత్తుకు తెచ్చి రైతులకు అందించిన ఘనత అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. నేడు రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. ఇవాళ చొప్పదండి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి గాయత్రీ పంపుహౌస్‌, నారాయణపూర్‌ రిజర్వాయర్‌, పోతారం రిజార్వాయర్‌, మిడ్‌ మానేరును నీటితో నింపి వాటర్‌హబ్‌లా తీర్చిదిద్దారన్నారు. జన్మజన్మలా సీఎం కేసీఆర్‌ను గుర్తు పెట్టుకుంటామన్నారు.   ముఖ్యమంత్రికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని, నియోజకవర్గ ప్రజలు, రైతుల తరఫున పాదాభివందనం చేస్తున్నామన్నారు. జలహారతిలో భాగంగా టీఆర్‌ఎస్‌ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు స్వీట్లు తినిపించారు.  ఎంపీపీ శ్రీరాం మధూకర్‌, వైస్‌ ఎంపీపీ కంకణాల రాజగోపాల్‌రెడ్డి,  గంగాధర, కురిక్యాల విండో చైర్మన్లు దూలం బాలగౌడ్‌, వెలిచాల తిర్మల్‌రావు, రాజనర్సింగం, వెల్ముల మల్లారెడ్డి, ఆయా మండలాల టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు మేచినేని నవీన్‌రావు, బందారపు అజయ్‌కుమార్‌, స్థానిక సర్పంచ్‌ ఎండీ నజీర్‌, మాల చంద్రయ్య, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ శుక్రొద్దీన్‌, నాయకులు రామిడి సురేందర్‌రెడ్డి, ఎల్కపల్లి లచ్చయ్య, ఆరెల్లి చంద్రశేఖర్‌, ముక్కెర మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo