గురువారం 28 మే 2020
Karimnagar - Feb 23, 2020 , 03:26:16

కరాటే చాంపియన్‌షిప్‌ సమరం

కరాటే చాంపియన్‌షిప్‌ సమరం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: 5వ జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌ చీఫ్‌ మినిస్టర్‌ కప్‌-2020 పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియంలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీల్లో 22 రాష్ర్టాలకు చెందిన సుమారు 1400 మంది క్రీడాకారులు, 100 మంది అఫీషియల్స్‌ పాల్గొంటుండగా, మొదటి రోజు శనివారం 20 రాష్ర్టాల నుండి సుమారు వెయ్యి మంది తరలివచ్చారు. కాగా, పోటీలను కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని సూచించారు. గత ఐదేళ్లుగా జాతీయ స్థాయి క్రీడలకు కరీంనగర్‌ వేదికగా మారిందనీ, జిల్లాకు చెందిన క్రీడాకారులు సైతం రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ మంచిపేరును తీసుకువస్తున్నారని తెలిపారు. కరీంనగర్‌లో 5వ సారి 5వ జాతీయస్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. కరాటే చాలా కష్టంతో కూడినదనీ, క్రీడలతో విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన క్రీడలో శిక్షణలు ఇప్పించాలనీ, ప్రాథమిక స్థాయి నుంచే ఇచ్చే శిక్షణతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. 


క్రమశిక్షణ, కఠోర సాధన, పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏమీ లేదన్నారు. మరో అతిథి డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి మాట్లాడుతూ కరీంనగర్‌ క్రీడానగరంగా మారడం సంతోషం గా ఉందనీ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. పోటీల నిర్వాహకుడు, సీఎస్‌కేఐ ఇండియా చీఫ్‌  శ్రీనివాస్‌ మాట్లాడుతూ నగరంలో వరుసగా ఐదుసార్లు జాతీయ స్థాయిలో కరాటే పోటీలు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాయ్‌ రిఫరీ కమిషన్‌ చైర్మన్‌ సిహాన్‌ ప్రేమ్‌జీత్‌ సింగ్‌, రెఫరీ కమిషన్‌ సభ్యుడు సిహాన్‌ రజనీష్‌ చౌదరి, కాయ్‌ టోర్నమెంట్‌ కమిషన్‌ మెంబర్‌ సిహాన్‌ వీ రవీందర్‌కుమార్‌, అథ్లెట్‌ కమిషన్‌ సభ్యుడు మహేశ్‌ కుస్వా, అసోసియేషన్‌ నేషనల్‌ సీఎస్‌కేఐ చైర్మన్‌ చల్ల హరిశంకర్‌, డీవైఎస్‌ఓ జీ అశోక్‌కుమార్‌, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్‌, కాయ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరు రాజిరెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్‌ కరాటే డో అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కే వసంత్‌కుమార్‌, కార్పొరేటర్లు కుర్ర తిరుపతి, శ్రీనివాస్‌, సీఎస్‌కేఐ కార్యదర్శి మాడుగుల ప్రవీణ్‌కుమార్‌, సభ్యుడు ఆర్‌ ప్రసన్నకృష్ణ పాల్గొన్నారు. 


నగదు బహుమతుల ప్రదానం

మొదటి రోజు కరాటే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహాకులు శనివారం రాత్రి నగదు బహుమతులు అందించారు. పురుషుల ఓపెన్‌ కుమిటీ విభాగంలో విజేతగా నిలిచిన శరత్‌కుమార్‌ (కర్నాటక)కు రూ.50 వేలు, రన్నరప్‌గా నిలిచిన గణేశ్‌(తెలంగాణ)కు రూ.10 వేలు, మహిళల విభాగంలో విజేత డీ ప్రసన్న (తెలంగాణ)కు రూ.40 వేలు, రన్నరప్‌ ప్రీతి (మధ్యప్రదేశ్‌)కి రూ.10 వేలు, పురుషుల ఓపెన్‌ కటా విభాగంలో విన్నర్‌ హస్‌మత్‌ బేగ్‌ (ఏపీ)కు రూ.20 వేలు, రన్నర్‌ ప్రశాంత్‌ (టీఎస్‌)కు రూ.10 వేలు, మహిళల ఓపెన్‌ కటా విభాగంలో విజేతకు తన్విక వాసి (తెలంగాణ)కి రూ.20 వేలు, రన్నర్‌గా నిలిచిన ఎం.భవానీ(తెలంగాణ)కి రూ.10 వేలు అందజేశారు. 


logo