ఆదివారం 31 మే 2020
Karimnagar - Feb 23, 2020 , 03:22:47

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాల గుత్తా సూచించారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలనీ, తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుంచే క్రీడల్లో ప్రోత్సహించాలని  పిలుపునిచ్చారు. శనివారం రాత్రి కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూర్‌లో ‘అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌' మొదటి వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలకు ప్రత్యేక గుర్తింపు ఉందనీ, ప్రతి ఒక్కరూ చదువుతోపాటు క్రీడలనూ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదువు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా వారి అభిరుచులకనుగుణంగా ఆటల్లో కూడా ప్రోత్సహించాలన్నారు.  అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యతోపాటు ఆటల్లోనూ ప్రత్యేక శ్రద్ధ్ద చూపుతుండడం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాలలో అన్ని వసతులున్నాయనీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని రాణించాలన్నారు.


పాఠశాల సీఈవో మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని మ్ము చేయమన్నారు. విద్యతోపాటు క్రీడలకు తమ పాఠశాల పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. ప్రతి విద్యార్థిని జాతీయస్థాయిలో  విద్యతోపాటు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ జగన్‌మోహన్‌రావు, పాఠశాల ప్రిన్సిపాల్‌ అనితరామకృష్ణన్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ రామారావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సరితారావుతోపాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 
logo