గురువారం 04 జూన్ 2020
Karimnagar - Feb 23, 2020 , 03:17:24

కలిసికట్టుగా పని చేస్తేనే పట్టణ ప్రగతి

కలిసికట్టుగా పని చేస్తేనే పట్టణ ప్రగతి

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి పట్టణ ప్రగతి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శనివారం పట్టణ ప్రగతిలో చేపట్టే అంశాలపై వార్డుల ప్రత్యేకాధికారులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 24 నుంచి చేపట్టే పట్టణ ప్రగతిలో పట్టణాలను స్వచ్ఛతగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నివసించే ప్రాంతాల్లో ప్రారంభించాలన్నారు. మున్సిపల్‌ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వార్డు ప్రత్యేకాధికారులు అంకిత భావంతో పని చేసి మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంతో పాటు తడి చెత్తలో పేరుకుపోయిన వ్యర్థాలను వేరు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. 


ప్రతి వార్డులో యువకులు, మహిళలు, అనుభవజ్ఞులు, ప్రముఖ వ్యక్తులతో కమిటీలు రూపొందించామనీ, ప్రతి కమిటీలో 18 మంది చొప్పున 60 మందితో వార్డు కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  మున్సిపాలిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, పట్టణ ప్రగతి విశిష్టతను తెలియజేయాలన్నారు. మంచినీటి సరఫరా, రహదారులు, పచ్చదనం పరిశుభ్రత, నర్సరీల ఏర్పాటుకు సమీప గ్రామాల గుర్తింపు, మెప్మా కార్యకలాపాలు, శ్మశాన వాటికలు, కూరగాయల, మాంసం మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్‌ టాయిలెట్ల కోసం స్థలాల గుర్తింపు, ఓపెన్‌ స్పేస్‌, స్ట్రీట్‌ వెండర్స్‌ కోసం స్థలాలు, పార్కింగ్‌ స్థలాలు గుర్తించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పై అంశాలపై ప్రత్యేకాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పట్టణాల్లో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఆశాఖ అధికారులు సమగ్ర కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. మున్సిపాలిటీల్లో శ్మశానవాటికలు, డంపు యార్డులు, మొక్కల పెంపకం, పారిశుధ్య ప్రాధాన్యతాంశాలుగా పరిగణించాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో నిర్దేశించిన కార్యక్రమాలకు రేటింగ్స్‌ ఇచ్చి ఉత్తమ మున్సిపాలిటీలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మార్చి 15 నుంచి 31వ తేదీ వరకు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాల ద్వారా పల్లె ప్రగతిని పర్యవేక్షణ చేయించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్‌, కొత్తపల్లి మున్సిపల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. 


logo