బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 22, 2020 , 02:14:17

రైతుల పక్షాన నిలువాలి

రైతుల పక్షాన నిలువాలి

సహకార సంఘాల అధ్యక్షులు రైతులపక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు.

  • బొమ్మకల్‌, చేగుర్తిలో చెక్‌డ్యాంలు నిర్మిస్తాం
  • దుర్శేడ్‌ సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు
  • సాగుకు సరిపడా నీళ్లు, కరెంట్‌ అందిస్తున్నాం
  • రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల
  • వన కరీంనగర్‌ జిల్లాగా మార్చాలని పిలుపు
  • గుండి వాగుకు ‘కేసీఆర్‌ వాగు’గా నామకరణం

కరీంనగర్‌ రూరల్‌:  సహకార సంఘాల అధ్యక్షులు రైతులపక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. శుక్రవారం నిర్వహించిన దుర్శేడ్‌ ప్రాథమిక సహకారం సంఘం చైర్మన్‌  బల్మూరి ఆనందరావు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  సొసైటీ చైర్మన్‌గా రైతులకు అండదండగా ఉంటూ, వారి సంక్షేమం కోసం కృషిచేయాలన్నారు. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనైనా టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టంగట్టారనీ, తమ బాధ్యతను మరింత పెంచారని పేర్కొన్నారు. సహకార సంఘాల్లో ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులకే ఓటువేసి, గెలిపించడం ఆనందంగా ఉందన్నారు.  సీఎం పనితీరును మెచ్చి గెలిపించారనీ,  ఇక మీ బాధ్యత తీరిపోయిందనీ, తాము పని చేయాల్సి ఉందని చెప్పారు.  ఓటు వేసిన ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు.  కొత్తపల్లి నుంచి చేగుర్తి వరకు పారుతున్న గుండివాగుకు ఆ పరిధిలో ‘కేసీఆర్‌ వాగు’గా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. డీ 94 ద్వారా ఎస్సారెస్పీ నుంచి కొత్తపల్లి చెరువులో చేరిన నీరు.. కొత్తపల్లి చెరువుకు మత్తడి పడి మోతె వాగు ద్వారా నగునూర్‌, ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, మొగ్దుంపూర్‌, చేగుర్తి వాగుల ద్వారా మానేరు వాగులో కలుస్తుందని వివరించారు. ఈ గ్రామాల  నుంచి వచ్చే  వాగుకు కేసీఆర్‌ వాగుగా నామకరణం చేయడంతోపాటు  చేగుర్తిలో చెక్‌డ్యాం నిర్మిస్తామని తెలిపారు.


చెక్‌ డ్యాంల కోసం ప్రణాళికలు..

కరీంనగర్‌ మండలంలోని మానేరు వాగుపై బొమ్మకల్‌, చేగుర్తిలో కేసీఆర్‌ వాగుపై చెక్‌ డ్యాంలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామనీ, టెండర్‌కు వచ్చిందని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. తర్వలో చెక్‌ డ్యాంల నిర్మాణం  పూర్తవుతుందనీ, ఆయా గ్రామాలకు భూగర్భజలాలు పెరిగి, ఎప్పటికీ సాగు నీరు  అందుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. అన్నదాతలకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌, రైతు బంధు, రైతు బీమాతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగుకు నీళ్లు ఇస్తున్నట్లు తెలిపారు.   సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేసి, చెల్లింపులు జరిపామని పేర్కొన్నారు. బల్మూరి అనందరావును గెలిపించుకున్నారనీ, ఆయన రైతుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. ఆయనకు రైతులందరి ఆశీర్వచనాలుండాలని కోరారు. సొసైటీ అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకుసాగాలని  చైర్మన్‌ ఆనందరావుకు సూచించారు.  


హరితజిల్లాగా మార్చాలి..

జిల్లాలో వనాలు పెంచి, హరిత కరీంనగర్‌గా మార్చాలనీ,  సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడాన్ని విధిగా మార్చుకోవాలని సూచించారు. కాగా, సొసైటీ చైర్మన్‌ బల్మూరి ఆనందరావు మాట్లాడుతూ,  తనకు చైర్మన్‌ పదవి వచ్చేలా కృషిచేసిన మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.   సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తాననీ,  రైతుల సంక్షేమ కోసం పాటుపడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలోజడ్పీటీసీ పురుమల్ల లలిత, మాజీ చైర్మన్‌ మంద రాజమల్లు, సొసైటీ  వైస్‌ చైర్మన్‌ గోనె నర్సయ్య, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, చల్ల హరిశంకర్‌, కరీంనగర్‌ వైస్‌ ఎంపీపీలు వేల్పుల నారాయణ, సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌, జక్కం నర్సయ్య, మంజుల, దబ్బెట రమణారెడ్డి, సుంకిశాల సంపత్‌రావు, వేణుమాధవరావు, తిరుపతి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి, గోలి రాజ్యలక్ష్మి, సర్వర్‌పాషా,  డైరెక్టర్లు గాజుల సారమ్మ, గాజుల అంజయ్య, బిజిలి పోచయ్య, కుంబం అంజలి, తోట తిరుపతి, కందుల రమేశ్‌, ఎర్రం అంజమ్మ, ఎస్‌. శేఖర్‌, గాండ్ల అంజయ్య, వేల్పుల రమేశ్‌, దాడి లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.  logo