బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 21, 2020 , 05:32:54

అభివృద్ధికి మీరే పునాది

అభివృద్ధికి మీరే పునాది

‘గ్రామాల అభివృద్ధికి మీరే పునాది రాళ్లు’ అని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులనుద్దేశించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక వీ కన్వెన్షన్‌లో జరిగిన పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • సంపాదన కోసం రాజకీయాల్లోకి రావద్దు
  • సేవాదృక్పథంతో ప్రగతి సాధించాలి
  • ధర్మాన్ని నిలబెట్టే సత్తా మీలోనే ఉంది..
  • పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో మంత్రి ఈటల
  • హాజరైన మంత్రి గంగుల కమలాకర్‌

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):‘గ్రామాల అభివృద్ధికి మీరే పునాది రాళ్లు’ అని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులనుద్దేశించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక వీ కన్వెన్షన్‌లో జరిగిన పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల  మాట్లాడుతూ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సంపాదన కోసం రాజకీయాల్లోకి రావద్దనీ, సేవా దృక్పథంతో అభివృద్ధి చేపట్టాలన్నారు. ప్రజా ప్రతినిధులపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలనీ, ఆ విశ్వాసం కోల్పోయినపుడు రాజకీయ వ్యవస్థ ఉనికికే ప్రమాదమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలవడం పెద్ద పనికాదనీ, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా గెలిచినపుడే నిజమైన నాయకుడని వ్యాఖ్యానించారు. గతంలో ఒక్కొక్కరు నాలుగైదు సార్లు సర్పంచులుగా గెలిచిన వాళ్లు ఉన్నారనీ, వారు ఆస్తులు పోగొట్టుకుని ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. ధర్మం నిలబెట్టే సత్తా ఉన్నవాళ్లు కిందిస్థాయిలో ఉన్న సర్పంచులేనన్నారు. ప్రభుత్వ పథకాలను నిజమైన లబ్ధిదారుడికి అందించే స్థోమత కేవలం సర్పంచులకే ఉంటుందని తెలిపారు. ఉన్నతస్థాయిలో ఉన్న తమలాంటి ప్రజాప్రతినిధుల గౌరవం నిలబెట్టేది కిందిస్థాయిలో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులేనని పేర్కొన్నారు. సర్పంచులు గొప్పగా పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పార్టీలు, జెండాలతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేయాలన్నారు. కొత్త చట్టాలు తెచ్చి సర్పంచులను నియంత్రించాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదనీ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఏవిధంగా అభివృద్ధి చేయాలనేదే తమ ఆలోచనని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ప్రభుత్వ పనులకు ఇసుక ఇప్పించే బాధ్యత తమదేననీ, అయితే ఈ అవకాశాన్ని ఆసరా చేసుకుని దందాలు చేయవద్దని మంత్రి ఈటల స్థానిక ప్రజా ప్రతినిధులను మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు.


సీఎం కలలు సాకారం చేద్దాం..: మంత్రి గంగుల

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నిత్యం ఆలోచిస్తారనీ, ఆయన కలను సాకారం చేసేలా మనం పనిచేద్దామని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.   పట్టుదలతో పోరాడి ఏ విధంగానైతే తెలంగాణను సాధించుకున్నామో అలాగే, ఇపుడు గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందన్నారు. పల్లెల్లో పచ్చదనం నెలకొనాలనీ, పారిశుధ్యం వెల్లి విరియాలనీ, ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారాలని సీఎం కేసీఆర్‌ ఆలోచన  చేస్తున్నారనీ, ఆయన ఆలోచనలకు అనుగుణంగా అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు పనిచేయాల్సిన అవసరముందని మంత్రి గంగుల పేర్కొన్నారు. నల్గొండ జిల్లా వాసి అయిన కలెక్టర్‌ కే శశాంక మన జిల్లాకు వచ్చి ఇక్కడ తట్టాబుట్ట పట్టి మన కోసం పనిచేస్తున్నారనీ, అలాగే ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి ఇక్కడికి వచ్చిన అధికారులు ఇక్కడి ప్రజల కోసం పనిచేస్తుంటే మన ప్రజల మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యతను మనం ఎందుకు తీసుకోకూడదన్నారు. ప్రతి గ్రామంలో విరివిగా మొక్కలు నాటడం విధిగా చేయాలన్నారు. జిల్లాలో 0.15 శాతం మాత్రమే అడవులున్నాయనీ, అడవుల శాతాన్ని పెంచాల్సిన ఆవశ్యకతపై సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆయనతో చెప్పిన విషయాలను మంత్రి గంగుల కమలాకర్‌ ప్రస్తావించారు. కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చినా తమ బిడ్డలు కరగదీస్తారనీ, అదే వాళ్లు బతికేందుకు మంచి వాతావరణాన్ని ఇస్తే గొప్పగా బతుకుతారన్నారు. ఇంచు స్థలం దొరికినా మొక్కలు నాటాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లాను హరిత వనంలా మార్చేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని కోరారు.  అక్షరాస్యతను పెంచేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని మంత్రి గంగుల పిలుపునిచ్చారు.  


ఆకట్టుకున్న రసమయి ప్రసంగం.. 

మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తనదైన శైలిలో సందర్భోచితంగా పాటలు పాడుతూ ‘పల్లె ప్రగతి’ ఆవశ్యకత అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రసంగించారు. పచ్చదనం, పారిశుధ్యం ఎందుకు పాటించాలి, దాని వల్ల గ్రామాలకు కలిగే ప్రయోజనాలను స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు సులభంగా బోధపడేలా వివరించారు. మధ్య మధ్యలో చిన్న కథలు, ఎమ్మెల్యేగా తన అనుభవాలను కథల రూపంలో విడమర్చి చెప్పారు. సభలో నవ్వులు పూయించారు. ఒకప్పుడు గొప్పగా బతికిన తెలంగాణ వలస పాలకుల పాలనలో ఎలా తయారయ్యింది.. చచ్చి బతికిన తెలంగాణకు సీఎం కేఈఆర్‌ ఏ విధంగా పునరుజ్జీవం పోస్తున్నారో చెప్పారు. చెట్లను నరికి మొక్కలు పెంచుకుంటున్నామనీ, ఉన్న చెట్లను కాపాడులేకపోతున్నామన్నారు. తాను అనేక గ్రామాలకు తెల్లవారు జామునే వెళ్లి మరుగుదొడ్లు కట్టుకునేలా ప్రజలకు అవగాహన కల్పించానని చెప్పారు. చెట్లు పెంచని, డంప్‌ యార్డులు, వైకుంఠధామాలు నిర్మించుకోని గ్రామాలకు తాను రానన్నారు.  ఆ గ్రామాల ప్రజలను ఓట్లు కూడా అడగనని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలనీ, సర్పంచులు స్వార్థ్ధం వీడితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.  ఓట్లు వేసిన వాళ్లు, వేయని వాళ్లు ఎవరైనా అంతా మనవాళ్లే అనుకుని అభివృద్ధి చేయాలన్నారు.


‘హరితహారం’ సీఎం దూరదృష్టికి నిదర్శనం : ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

‘హరితహారం’ కార్యక్రమం సీఎం కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారన్నారు. మన భావితరాలకు తెలంగాణలో మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారనీ, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరముందన్నారు. ప్రతి గ్రామంలో ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధించుకుని పక్కాగా అమలు చేసుకోవాలని సూచించారు. ప్రతి పనికి ప్రభుత్వం నిధులు ఇస్తున్నదనీ, ఇచ్చే నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుని గ్రామాల పురోభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కోరారు.


పల్లె ప్రగతితో పునర్వైభవం: ఎమ్మెల్సీ నారదాసు

గ్రామాలకు పూర్వవైభవం తెచ్చేందుకు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు సీఎం కేసీఆర్‌ ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని రూపొందించారనీ, ఆ దిశగా ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు.  గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. 


విజయవంతం చేయాలి: జడ్పీ అధ్యక్షురాలు

‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైతేనే గ్రామాల్లో సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. గ్రామస్తులు ఇంటింటికీ మొక్కలు నాటుకునేలా, ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. 


నిరంతరం కొనసాగించాలి.. :కలెక్టర్‌ శశాంక 

‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా గ్రామాల్లో కొనసాగించాలని కలెక్టర్‌ కే శశాంక సూచించారు. గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించినప్పుడే పల్లెలు పచ్చదనంతో వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజూ తడి,పొడి చెత్తను సేకరించి డంప్‌ యార్డులకు తరలించాలని సూచించారు. తడి,పొడి చెత్తను సేకరించేందుకు ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలు అందిస్తామన్నారు. చెత్తను డంప్‌ యార్డులకు తరలించేందుకు, నాటిన మొక్కలకు నీళ్లు పోసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌ను సమకూర్చుకునే అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో 23 మినహా అన్ని పంచాయతీలు ట్రాక్టర్లు కొనుగోలు చేసుకునేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ట్రాలీ, ట్యాంకర్లు సమకూర్చుకునే అవకాశాన్ని పంచాయతీలకే ఇస్తున్నామనీ, అయితే వాటిని తయారు చేయించే ముందు తమకు తప్పని సరిగా సమాచారం అందించాలన్నారు. గేజ్‌ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దనీ, పంచాయతీ రాజ్‌ ఇంజినీర్లు గేజ్‌ను తనిఖీ చేసిన తర్వాతనే తయారీ పనులు చేసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 


ఈ నెలాఖరులోగా ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పంచాయతీల వద్ద రూ. 77 కోట్లు ఉన్నాయనీ, రూ. 66 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయనీ, ట్రాక్టర్ల కోసం రూ. 5.5 కోట్లు ఖర్చు చేస్తున్నారని లెక్కలు చెప్పిన కలెక్టర్‌ 500  కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలు మినహా అన్నింటిలో నిధులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఏ పంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయో తాము నిత్యం పర్యవేక్షిస్తుంటామనీ, పనులు చేపట్టడంలో నిధులు లేవని చెప్పకుండా ప్రజలకు అవసరమైన ప్రతి పనిని చేపట్టాలని కలెక్టర్‌ శశాంక సర్పంచులను కోరారు. సమ్మేళనానికి అధ్యక్షత వహించిన కలెక్టర్‌ మంత్రుల చేతుల మీదుగా ‘పల్లె ప్రగతి’ యాప్‌ను ఆవిష్కరింపజేశారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ పేరాల గోపాల్‌రావు, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, నగర మేయర్‌ వై. సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పీ సీఈవో డీ వెంకటమాధవరావు, డీఆర్డీవో ఏ వెంకటేశ్వర్‌రావు, హుజూరాబాద్‌ ఆర్డీవో పీ బెన్‌షాలోం, డీపీవో రఘువరణ్‌, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు సమ్మేళనంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి సంధానకర్తగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కో ఆర్డినేటర్‌ కిషన్‌స్వామి వ్యవహరించారు.


logo