శనివారం 30 మే 2020
Karimnagar - Feb 21, 2020 , 05:20:57

శంభో శంకర

శంభో శంకర

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో జాతర ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

  • వేములవాడలో వైభవోపేతంగా ఉత్సవాలు మొదలు
  • శివనామస్మరణతో మారుమోగుతున్న రాజన్న ఆలయ పరిసరాలు
  • రాత్రి అలరించిన శివార్చన కార్యక్రమాలు
  • తిలకించిన దేవాదాయశాఖ మంత్రి అల్లోల, ఎమ్మెల్యే చెన్నమనేని
  • నేటి ఉదయం ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు సమర్పించనున్న ఐకేరెడ్డి
  • పాల్గొననున్న మంత్రులు హరీశ్‌రావు, ఈటల, గంగుల

(వేములవాడ నమస్తే తెలంగాణ/కల్చరల్‌) : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో జాతర ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం నుంచి తాకిడి అంతంతే ఉన్నా రాత్రి వరకు పోటెత్తారు. రోజు మొత్తంలో 50వేల మందికిపైగా తరలివచ్చారు. మిషన్‌ భగీరథ నీటితో నింపిన పవిత్ర ధర్మగుండంలో స్నానాలు చేసి, రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. గంటలపాటు క్యూలైన్లలో ఉండి మరీ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం శివరాత్రి కాగా జాగరం కోసం రాత్రి ఇక్కడే ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను రద్దు చేశారు. నేడు, రేపు భక్తులందరికీ లఘు దర్శనం కల్పించనున్నారు. క్యూలో నిల్చున్న భక్తులకు ఆలయ సిబ్బంది మంచినీటిని అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ రాహూల్‌హెగ్డే ఆధ్వర్యంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్‌, పట్టణ సీఐ శ్రీధర్‌ ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు. భక్తుల కోసం వేములవాడ ప్రధాన బస్టాండ్‌ నుంచి చెరువులో ఉన్న ఆలయ పార్కింగ్‌ స్థలం వరకు ఆర్టీసీ బస్సును  నడుపుతుండగా, ఉదయం కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాయకులు రాఘవరెడ్డితో పాటు ఆలయ ఈవో కృష్ణవేణి ఉన్నారు.


అర్ధరాత్రి రుద్రాభిషేకం.. 

నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 5గంటల నుంచి 6గంటలవరకు స్వామివారికి ప్రాతఃకాలపూజ, సాయంత్రం 6 గంటలకు వేములవాడ పట్టణానికి చెందిన 128 అనువంశిక అర్చక కుటుంబాలకు చెందిన బ్రాహ్మణులచే ఆలయ అద్దాలమండపంలో 3గంటలపాటు మహాలింగార్చన చేయనున్నారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలమందు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనం గా నిర్వహిస్తున్నట్లు ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భగుడిలో ఆర్జితసేవలను రద్దు చేశారు. 


నేడు పట్టువస్ర్తాల సమర్పణ..

రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం స్వామివారికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. గురువారమే వేములవాడకు చేరుకొని, ఆలయ అతిథి గృహంలో రాత్రి బస చేశారు. నేటి ఉదయం 8గంటలకు మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌తోపాటు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి స్వామివారికి పట్టువస్ర్తాలు అందజేయనున్నారు. అనంతరం మంత్రులు స్వామివారికి విశేషపూజలు నిర్వహిస్తారు. అలాగే టీటీడీ తరపున ఉదయం 7గంటలకు పట్టువస్ర్తాలను అందజేయనున్నారు.


logo