గురువారం 28 మే 2020
Karimnagar - Feb 20, 2020 , 02:47:27

సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

సమస్యలపై నిర్లక్ష్యం వద్దు


(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)జడ్పీ అధ్యక్షురాలు విజయ అధ్యక్షతన నగరంలోని జడ్పీ నూతన భవనంలో తొలిసారి జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ హాజరు కాగా, ఈ సందర్భంగా పలు శాఖలపై చర్చించారు. ఉదయం జరిగిన సభలో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై మంత్రి గంగుల అక్కడికక్కడే అధికారులతో చర్చించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుక లభించడం లేదని పలువురు సభ్యులు ప్రస్తావించగా మైనింగ్‌ అధికారులను వివరణ కోరారు. ఈ సందర్భంలో కలెక్టర్‌ శశాంక జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. జిల్లాలో కొన్ని రీచ్‌లు గుర్తించామని 470 చెల్లిస్తే ట్రాక్టర్‌ లోడ్‌ ఇసుక ఇచ్చే విధంగా పాలసీ రూపొందించామని చెప్పారు. నిబంధనలు కఠినంగా ఉంటే ట్రాక్టర్‌ యజమానులు వచ్చే అవకాశం ఉండదనీ, నిబంధనలు సడలించాలని కలెక్టర్‌ను గంగుల కోరారు. ఓటీపీ సిస్టంలో కాకుండా జీపీఎస్‌ సిస్ట్టంలో ఇసుక సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖపై జరిగిన చర్చలో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని చిగురుమామిడి సభ్యుడు గీకురు రవీందర్‌ కోరగా, వచ్చే బడ్జెట్‌లో 20 శాతం నిధులు ప్రభుత్వ విద్యకు కేటాయిస్తూ జడ్పీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని జడ్పీ అధ్యక్షురాలు విజయను కోరారు. భోజన విరామం తర్వాత మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. ఆయన సమక్షంలో కూడా పలువురు సభ్యులు సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా మిషన్‌ భగీరథ గురించి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ప్రస్తావించారు. జమ్మికుంట జడ్పీటీసీ సభ్యులు శ్రీరాం శ్యాం తమ మండలంలోని రోడ్ల పరిస్థితిని ప్రస్తావించారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. అనుభవం లేని కొన్ని కాంట్రాక్టు ఏజెన్సీలు మిషన్‌ భగీరథ పనులు చేపట్టిన నేపథ్యంలో పనుల్లో కొంత ఆలస్యం జరుగుతున్నదనీ, అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీ సీఈఓ డీ వెంకట మాధవరావు, టూరిజం సంస్థ చైర్మన్‌ పన్యాల భూపతి రెడ్డి, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 


కలెక్టర్‌ కే శశాంక మాట్లాడుతూ, 2019 రబీ డేటా ప్రకారమే అప్‌లోడ్‌ అయిన వారికి మాత్రమే రైతుబంధు డబ్బులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో డేటా అప్‌లోడ్‌ అవుతున్నదనీ, దాని ప్రకారమే ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులు ఆధార్‌ నెంబర్‌, నామినితో ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనీ, వారికే రైతుబీమా వర్తిస్తుందన్నారు. ప్రజా ప్రతినిధులు అర్హులైన వారందరినీ రైతుబీమా పథకంలో నమోదు చేయించాలని కోరారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో 15 మంది కన్నా విద్యార్థులు తక్కువగా ఉండి, బాలింతలు రాకుంటే రేషనలైజేషన్‌లో భాగంగా సెంటర్‌ను తొలగిస్తామన్నారు. అంగన్‌వాడీ సెంటర్‌ గ్రామాల్లో ఉండాలంటే పిల్లల సంఖ్య పెంచాలన్నారు. జిల్లాలో 313 గ్రామపంచాయతీలుండగా, 3 పంచాయతీలకు ఇదివరకే ట్రాక్టర్లు, ట్రేలర్లు, ట్యాంకర్లు ఉన్నాయన్నారు. మిగిలిన 310 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేశామని తెలిపారు. ట్యాంకర్లు, ట్రేలర్ల తయారీ దారులు జిల్లాలో ఆరుగురే ఉన్నందున వాటిని సకాలంలో అందించలేకపోతున్నామనీ, మార్చి 2వ వారంలోగా అందిస్తామని చెప్పారు. 


చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ, ఇంటింటికీ తాగునీరు అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ను సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారనీ, అనేక సార్లు సమావేశం ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో మిషన్‌ కాకతీయ పనులు కూడా మిగిలి పోయాయనీ, ఈ వేసవి కాలంలోనే ఈ పనులు పూర్తి చేయాలని కోరారు. విద్యలో వెనకబడి పోయామనీ, పక్కనున్న జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నదని చెప్పారు. చొప్పదండి దవాఖానకు పోస్టులు మంజూరు చేయాలని మంత్రి ఈటలను కోరారు.ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మిషన్‌ భగీరథ సకాలంలో పూర్తి కాలేకపోతున్నదని అన్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టు వ్యవస్థ సరిగ్గా లేక పోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ఈ పనులు పూర్తి చేసి సీఎం ఆశయాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుండాలని కోరారు. logo