బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 19, 2020 , 02:25:23

అద్దెదారులపై అప్రమత్తంగా ఉండాలి

అద్దెదారులపై  అప్రమత్తంగా ఉండాలి

అద్దెదారులపై యజమానులు అప్రమత్తంగా ఉండాలనీ, అద్దెదారులకు సంబంధించిన వివరాలను ఇంటి యజయానులకు ఉచితంగా అందజేస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు.

కరీంనగర్‌ క్రైం: అద్దెదారులపై యజమానులు అప్రమత్తంగా ఉండాలనీ,  అద్దెదారులకు సంబంధించిన వివరాలను ఇంటి యజయానులకు ఉచితంగా అందజేస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు.  నగరంలోని పోచమ్మవాడలో పోలీసులు మంగళవారం కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. అనంతరం కాలనీవాసులతో  సీపీ మాట్లాడుతూ, అద్దెదారులకు సంబంధించిన ఆధార్‌కార్డు, ఇతర వివరాలను ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ ద్వారా లేదా సంబంధిత పోలీస్‌స్టేషన్లకు వెళ్లి అందించినా సత్వరం స్పందించి, వివరాలు అందజేస్తామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇచ్చినట్లయితే సంఘ విద్రోహక, అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శివారు ప్రాంతాల్లోని నివాసులు అనుమానితుల కదలికలు ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.  ప్రతి ఒక్కరూ హ్యాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. మద్యం తాగి, వాహనాలు నడపవద్దనీ, రోడ్డు భద్రతలో భాగంగా నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 71 వాహనాలు, రూ. 7500 విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీలు పీ అశోక్‌, మదన్‌లాల్‌, కార్పొరేటర్‌ ఐలేందర్‌యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ సతీశ్‌, ఇన్స్‌పెక్టర్లు విజయ్‌కుమార్‌, దేవారెడ్డి, విజ్ఞాన్‌రావు, దామోదర్‌రెడ్డి, ఆర్‌ఐలు మల్లేశం, జానిమియా, శేఖర్‌, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, శ్రీధర్‌, రాములతోపాటు వివిధ విభాగాలకు చెందిన 150 మంది పోలీసులు పాల్గొన్నారు. కాగా, కాలనీవాసులు ఇప్పటి వరకు 28 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోగా, మరో 25 సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకువచ్చిన కాలనీవాసులను సీపీ అభినందించారు. పని చేయని సీసీ కెమెరాల గురించి సమాచారం అందిస్తే వెంటనే మరమ్మతులు చేయిస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. 


logo