బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 19, 2020 , 01:50:40

గోదారి పరవళ్లు

గోదారి పరవళ్లు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లలో గోదారి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని గోలివాడలో నిర్మించిన పార్వతీ పంప్‌హౌస్‌ నుంచి అధికారులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.

  • విజయవంతంగా కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు
  • కాళేశ్వరం నుండి ఎల్‌ఎండీ వరకు పరుగులు

రామడుగు/ బోయినిపల్లి/ ధర్మారం/ అంతర్గాం/ తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లలో గోదారి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని గోలివాడలో నిర్మించిన పార్వతీ పంప్‌హౌస్‌ నుంచి అధికారులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు 4, 5, 6, 7 మోటర్లను ఆన్‌ చేయగా, అవి 10,440 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నాయి. కాగా, పార్వతీ బ్యారేజ్‌ రిజర్వాయర్‌ 130.00 మీటర్లకు ఫోర్‌బేలో 128.30 మీటర్ల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని 6వ ప్యాకేజీలో నంది పంప్‌హౌస్‌లో ఎత్తిపోతలు దిగ్విజయంగా కొనసాగాయి. మంగళవారం కూడా 3, 5, 6 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోశారు. ఒక్కో మోటర్‌ 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం 9,450 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు. నంది రిజర్వాయర్‌ నుంచి 7వ ప్యాకేజీలోని జంట సొరంగాల ద్వారా 8 ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలుతున్నాయి. ఇక్కడ మంగళవారం 1, 2, 3 పంపులు నీటిని ఎత్తిపోశాయి. వీటి ద్వారా 9,450 క్యూసెక్కుల నీరు డెలివరీ సిస్టర్న్‌ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా వరదకాలువకు, అక్కడి నుండి ఎస్సారార్‌కు వెళ్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 5.333 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా, ఎత్తిపోతల ప్రక్రియను ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వేంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏఈఈలు శ్రీనివాస్‌, వైద సురేష్‌కుమార్‌, రమేష్‌నాయక్‌, వెంకటేష్‌, మెగా ఏజెన్సీ ప్రతినిధులు, తదితరులున్నారు. 


ఎస్సారార్‌ నుంచి 6,250 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి మంగళవారం 6,250 క్యూసెక్కుల నీటిని పంపించారు. రివర్స్‌ స్లూయిస్‌ ద్వారా దిగువకు నీటిని పంపుతున్నారు. ఈ నేపథ్యంలో 10, 11, 16, 17 గేట్లను ఎత్తి దిగువకు రెండు రోజులు నీటిని వదలిన ఇంజినీరింగ్‌ అధికారులు మంగళవారం గేట్లను మూసి వేశారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో 24.850 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. లక్ష్మీపూర్‌ పంపు హౌస్‌ నుంచి వచ్చిన నీటిని యథావిధిగా దిగువకు వదలుతున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. మంగళవారం ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయం నుంచి దిగువకు రివర్స్‌ స్లూయిస్‌ (4 తూముల)తో 6,250వేల క్యూసెక్కుల నీటిని పంపినట్లు పేర్కొన్నారు. 


10 టీఎంసీలకు ఎల్‌ఎండీ నీటిమట్టం

ఎస్సారార్‌ జలాశయం స్లూయిస్‌ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి 10,439 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంగా వస్తుండగా, 265 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో రూపంలో వెళ్తున్నది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 10.228 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.


logo