ఆదివారం 31 మే 2020
Karimnagar - Feb 18, 2020 , 02:48:55

కుటుంబాన్ని కాటేసిన విధి

 కుటుంబాన్ని కాటేసిన విధి

నగరంలోని బ్యాంకు కాలనీకి చెందిన నరెడ్డి సత్యనారాయణరెడ్డి, రాధ దంపతులు. రాధ ప్రస్తుత పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్వయాన సోదరి. సత్యనారాయణరెడ్డి, రాధ దంపతులకు కొడుకు శ్రీనివాస్‌రెడ్డి, కూతురు వినయశ్రీ ఉన్నారు. వీరు ఉన్నత విద్యావంతులుగా ఎదిగారు. సత్యనారాయణరెడ్డి సాయి తిరుమల ఏజెన్సీ పేరిట ఎరువుల వ్యాపారం చేస్తూ, ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకున్నాడు. ఆయన భార్య మల్కాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నది. సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాద రూపంలో దంపతులతోపాటు కూతురును బలితీసుకున్నది. 


కొడుకును కాటేసిన విధి.. 

సత్యనారాయణరెడ్డి కొడుకు శ్రీనివాస్‌రెడ్డి ఆరేళ్ల క్రితం ఇంజినీరింగ్‌ పూర్తిచేయగా.. బహుమతిగా కారు కొనిచ్చాడు. ఆ సమయంలో స్నేహితులతో కలిసి సిరిసిల్ల వైపు వెళ్తుండగా రగుడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కొడుకు అనుకోని రీతిలో చనిపోవడం ఆ కుటుంబాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన తీరని దుఃఖాన్ని మిగిల్చింది. నెమ్మదిగా ఆ షాక్‌ నుంచి బయట పడినా, తల్లి రాధ మాత్రం మానసికంగా మరింత కుంగిపోయింది. కొంతకాలం చికిత్స కూడా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇటు కూతురు వినయశ్రీ నిజామాబాద్‌లోని మేఘన డెంటల్‌ సైస్సెస్‌ కళాశాలలో బీడీఎస్‌ చదువుతుండగా, ఇప్పుడిప్పుడే ఆ షాక్‌లోంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సమయంలో తమ ఇల్లు కలిసి రాలేదని విక్రయించి, ఆపై రద్దు కూడా చేసుకున్నారు. అయితే మానసిక ప్రశాంతత కోసం టూర్లు, తీర్థ యాత్రలు వెళ్తూ అందరి నుంచి దూరంగా ఉంటుండడంతో వాళ్లింట్లో జరిగే విషయాలు పూర్తిగా ఎవరికి తెలియని పరిస్థితి ఉన్నది. గత నెల 27న నుంచి ఆ కుటుంబం ప్రశాంతత కోసం ఎక్కడికో టూర్‌ వెళ్లి ఉంటారని బంధువులు భావించినట్లు తెలుస్తున్నది.


కాకతీయ కాలువలో మృతదేహాలు..

ఆదివారం రాత్రి అల్గునూర్‌ శివారులోని కాకతీయ కాలువలో గల్లంతైన మహిళ ఆచూకీ కోసం నీటి సరఫరా నిలిపివేయగా, అర్ధరాత్రి మానకొండూర్‌ మండలం ముంజంపల్లి శివారులో మృతదేహాన్ని గుర్తించారు. నీటి సరఫరా ఆగిపోవడంతో సోమవారం తెల్లవారుజామున కాలువ వెంట వెళ్తున్న రైతులు కారు బోల్తా పడి ఉండడం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి పోలీసులు చేరుకొని కారును పరిశీలించగా, అందులో మూడు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఘటన స్థలానికి క్రేన్‌ను తెప్పించి బయటికి తీశారు. కారు నంబర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి, బ్యాంకు కాలనీకి చెందిన నరెడ్డి సత్యనారాయణరెడ్డి కుటుంబంగా గుర్తించారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత మృతులు సత్యనారాయణరెడ్డి (55), అతని భార్య రాధ (50), కూతురు వినయశ్రీ (24)గా తేల్చారు. కారు 20 రోజుల క్రితమే కాలువలో పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబం అని గుర్తించి సమాచారం ఇవ్వడంతో బంధువులు, సన్నిహితులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా మానసిక ప్రశాంతత కోసం వారు టూర్లకు వెళ్తుంటారనీ, ఆ సమయంలో ఫోన్లో అందుబాటులో ఉండరనీ, అందరం అదే భావించామనీ, కానీ ఇలా కాలువలో శవాలై తేలుతారని అనుకోలేదని కంటతడి పెట్టారు. ఉన్నతమైన కుటుంబం, నిర్జీవంగా కాలువలో పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


యాత్రలకు వెళ్లారనుకుంటే..?

కొడుకు మృతితో మానసికంగా కుంగిపోయిన ఆ కుటుంబం నెమ్మదిగా కుదుటపడ్డా, తల్లి రాధ మాత్రం ఆ షాక్‌ నుంచి కోలుకోలేదు. రాధకు చికిత్స చేయిస్తూనే ఆ బాధను మరిచిపోయేందుకు కుటుంబమంతా యాత్రలకు వెళ్లేవారని సన్నిహితులు, బంధువులు తెలిపారు. ప్రశాంతంగా గడిపితే ఆ షాక్‌ నుంచి తన భార్య కుదుట పడుతుందనీ, అలా వెళ్లే సమయంలో ఫోన్లు అందుబాటులో ఉంచుకోవడం లేదని సత్యనారాయణరెడ్డి చెపుతుండేవాడని గుర్తు చేశారు. గత నెల 27న వెళ్లిన సత్యనారాయణరెడ్డి ఫోన్లు స్విచ్చాఫ్‌ రావడంతో కుటుంబసభ్యులను విచారించేందుకు ప్రయత్నించినా అందరి ఫోన్లు పనిచేయలేదని ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు తెలిపారు. ఏదైనా తీర్థయాత్రకు వెళ్లి ఉంటారని భావించామని చెప్పారు. రెండు నెలల క్రితం కూతురు వినయశ్రీ తాను చదివే మెడికల్‌ కళాశాల స్నేహితులతో కలిసి టూర్‌ వెళ్తానంటే వద్దనీ, కుటుంబంతో సహా కేరళ వెళ్దామని సత్యనారాయణరెడ్డి చెప్పినట్లు తెలిపారు. ఈ క్రమంలో 22 రోజులుగా ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో టూర్‌ వెళ్లారనే తాము భావించామనీ, ఇలా ఆ కుటుంబం కనుమరుగై పోతుందని అనుకోలేదని సన్నిహితులు కంటతడి పెట్టారు. 


ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దిగ్భ్రాంతి..

సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని, తన సోదరి, బావ, కోడలు మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతనెల 27న హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు చెప్పారనీ, అప్పటి నుంచి ఫోన్లు పని చేయలేదనీ, ఎటైనా యాత్రలకు వెళ్లి ఉంటారని తాము భావించామని చెప్పారు. ఏడాదికోసారి ఏదైనా టూర్‌కు వెళ్తుంటారనీ, అలా ఏమైనా వెళ్లారెమో అనుకుని ఎదురు చూశామని తెలిపారు. బంధువుల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నించామని చెప్పారు. కానీ, ఇలా కారులో శవాలుగా కనిపించారని కంటతడిపెట్టారు. మానకొండూర్‌ రసమయి బాలకిషన్‌ అక్కడికి చేరుకుని దాసరిని పరామర్శించారు.


 పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

ఘటనా స్థలాన్ని కలెక్టర్‌ శశాంక, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి పరిశీలించి, పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలియలేదని తెలిపారు. ట్రైనీ ఐపీఎస్‌ నిఖితా పంత్‌ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. నగరంలోని అలకాపురి కాలనీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 


మానేరు వంతెనపై పరిశీలన

కరీంనగర్‌ శివారులోని మానేరు వంతెనపై జరిగిన ప్రమాద స్థలాన్ని కలెక్టర్‌ శశాంక, సీపీ సోమవారం పరిశీలించారు. అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచనలు చేశారు. తక్షణమే ఇక్కడ రేలింగ్‌ నిర్మించాలని వారిని ఆదేశించారు.


లక్ష్మీపూర్‌లో విషాదం

రామడుగు : నారెడ్డి సత్యనారాయణరెడ్డితో పాటు భార్య, కూతురు మృతిచెందడంతో ఆయన స్వగ్రామమైన రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో విషాదం నెలకొంది. సత్యనారాయణరెడ్డి సుమారు ఇరవైఏండ్ల క్రితం లక్ష్మీపూర్‌ను వదిలి కరీంనగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. స్వగ్రామంలో అందరితో కలిసిమెలసి ఉండేవారని స్థానికులు పేర్కొన్నారు.


logo