శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 18, 2020 , 02:38:23

జన హృదయ నేతకు హరిత కానుక

జన హృదయ నేతకు హరిత కానుక

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు 66వ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం కరీంనగర్‌లో ముందుగానే ప్రకటించిన విధంగా మంత్రి గంగుల కమలాకర్‌ ‘గ్రీన్‌సిటీ’కి శ్రీకారం చుట్టారు. 6,666 మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండేండ్లలో 5 లక్షల మొక్కలు నాటుతామని స్పష్టం చేశారు. స్థానిక సర్కస్‌ గ్రౌండ్‌, ఐటీ టవర్‌, మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, మేయర్‌ వై సునీల్‌ రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి పలువురు కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు మొక్కలు నాటారు. కొత్తపల్లి మున్సిపాలిటీలో చైర్మన్‌ రుద్ర రాజు, కౌన్సిలర్లు, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కరీంనగర్‌ గ్రంథాలయ సంస్థ కేంద్ర కార్యాలయంలో చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి మొక్కలు నాటారు. నగరంలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో రైస్‌మిల్లర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత కమాన్‌పూర్‌లో మొక్కలు నాటి మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. చామన్‌పల్లిలో కరీంనగర్‌ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పెద్దఎత్తున మొక్కలు నాటారు.


హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 66 కిలోల కేక్‌ను మంత్రి ఈటల కట్‌చేశారు. మిఠాయిలు పంచారు. హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాల్లో మొక్కలు నాటారు. స్థానిక రైస్‌మిల్లర్లు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు జడ్పీ అధ్యక్షురాలు విజయ, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇల్లందకుంట, వీణవంకలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు మొక్కలు నాటారు. జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ దర్గాలో ముస్లిం మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మొక్కలు నాటారు. హుజూరాబాద్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, నీరు పోశారు. సైదాపూర్‌ మండలంలో కూడా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.


మానకొండూర్‌ మండల కేంద్రంలోని పల్లె మీది చౌరస్తాలో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ సభ్యులు తాళ్లపల్లి శేఖర్‌ గౌడ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఇదే మండలం ముంజంపల్లిలో కూడా కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తిమ్మాపూర్‌ మండల కేంద్రంతోపాటు మహాత్మానగర్‌లో కూడా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మొక్కలు నాటారు. ఎంపీపీ కేతిరెడ్డి వనిత పలువురు నాయకులు పాల్గొన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు, ఆయా గ్రామాల్లో మహిళలు మొక్కలు నాటి, సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఎల్‌ఎండీ కాలనీలోని అమరవీరుల స్థూపం వద్ద టీఎన్‌జీఓస్‌ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో, తిమ్మాపూర్‌లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అధికారులు మొక్కలు నాటారు. గన్నేరువరం మండలంలో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. శంకరపట్నం మండలం తాడికల్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. చిగురుమామిడి మండల కేంద్రంలో స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేసి మొక్కలు పెట్టారు. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం చిన్న ముల్కనూర్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మొక్కలు నాటారు.


చొప్పదండి మండలం భూపాలపట్నంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కేక్‌ కట్‌చేసి మొక్కలు నాటారు. గంగాధర మండలంలోని 33 గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంగాధర వ్యవసాయ మార్కెట్‌లో చైర్మన్‌ మహిపాల్‌ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. రామడుగు మండలం వెలిచాలలో ఎంపీపీ కలిగేటి కవిత స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు పెట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 


logo