బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 17, 2020 , 03:17:11

మొక్కలు నాటుదాం..కానుక ఇద్దాం..

మొక్కలు నాటుదాం..కానుక ఇద్దాం..

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి, ప్రకృతి విధ్వంసం పెరిగిన తర్వాత వన్యప్రాణులు జనారణ్యంలోకి రావడం ప్రారంభించాయి. ముఖ్యంగా కోతులు నివాస ప్రాంతాల్లో చొరబడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అడవుల్లో వాటికి ఆహారాన్ని అందించే చెట్లను నరకడంవల్ల కోతులు జనజీవనంలోకి వస్తున్నాయనే యధార్థాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ఏటా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రెండు సార్లు జిల్లాకు వచ్చి మొక్కలు నాటారు. చివరి సారిగా కరీంనగర్‌ శివారులోని మానేరు తీరం వద్ద మహాఘని మొక్కను నాటారు. ఇప్పుడది ఏపుగా పెరిగి సీఎం కేసీఆర్‌ కలలు సాకారమవుతున్నాయనడానికి నిదర్శనంగా కనిపిస్తున్నది.


మొక్కలు పెంచడం కోసం చట్టం.. 

మొక్కలను నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతలను చట్టం రూపంలో తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. పంచాయతీ రాజ్‌ చట్టంతో నర్సరీల పెంపకం బాధ్యతలను పంచాయతీలకు అప్పగించారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికించని పక్షంలో సంబంధిత పంచాయతీలపై కఠిన చర్యలు తీసుకునేలా పంచాయతీ రాజ్‌ చట్టం-2018లో రూపొందించారు. ఈ చట్టంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. నాటిన మొక్కలను సంరక్షించాలనే బాధ్యతను ఈ చట్టం తప్పనిసరి చేసింది. ఇప్పుడు గ్రామాల్లో హరిత హారం మొక్కలంటే ప్రత్యేకంగా చూడబడుతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలను పీకేసినా, పశువులచే మేపినా పంచాయతీలు పెద్ద మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నాయి. అంతే కాకుండా ప్రతి పంచాయతీ పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుకొని వాటిని అదే గ్రామాల్లో నాటుకుని సంరక్షించించుకునే విధంగా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు. గతంలో మొక్కలు కావాలంటే ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలో తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి గ్రామంలో మొక్కలు లభించే పరిస్థితిని సీఎం తెచ్చారని చెప్పవచ్చు. దీంతో గ్రామాల్లో ఇపుడు ఏ కాలంలోనైనా మొక్కలు నాటుకుని సంరక్షించుకోవాలనే సామాజిక బాధ్యత ప్రజకు క్రమంగా అలవడుతున్నది. పూలు, పండ్ల మొక్కలే కాదు నీడ నిచ్చేవి, భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే మొక్కలు కూడా ఇపుడు గ్రామాల నర్సరీల్లో అందుబాటులో ఉంటున్నాయి. 


పుట్టిన రోజు కానుకగా మొక్కలు.. 

పర్యావరణ ప్రేమికుడిగా, తెలంగాణను ఆకుపచ్చ లోగిలా మార్చాలని కలలుగంటున్న సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఇటు ప్రభుత్వ యంత్రాంగం, అటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు నిర్ణయించుకోవడం హర్షనీయం. సోమవారం ఆయన పుట్టిన రోజున ఒక్కో కార్యకర్త ఒక్కో మొక్కను నాటాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారావు పిలుపు నిచ్చారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధపడుతున్నారు. ఎక్కడి వారు అక్కడే మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు కార్యకర్తలను పెద్ద ఎత్తున కదిలించే పరిస్థితి కనిపిస్తున్నది. ఇక ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్‌ పుట్టిన రోజు మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పక్షాన సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున ఇంటికో మొక్క నినాదం ఇచ్చింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో 2.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నది. ఈ మేరకు అన్ని మండలాల ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు డీఆర్‌డీఓ ఏ వెంకటేశ్వర్‌ రావు తెలిపారు. ప్రతి మహిళా సంఘాలకు మొక్కలు నాటే బాధ్యతలను అప్పగించారు. ఇటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజున నాటిన మొక్కలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. 


నగరంలో గ్రీన్‌సీటికి శ్రీకారం.. 

మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై సునీల్‌రావుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల స్వయంగా మాట్లాడి, నగరం మొత్తం కాంక్రీట్‌ జంగల్లా కనిపిస్తున్నదనీ, గ్రీనరీ పెంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రెండేళ్లలో 5 లక్షల మొక్కలు నాటే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పిన మంత్రి గంగుల, ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజున ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం ఒక్కరోజే 6,666 మొక్కలు నాటి తమ ప్రియతమ నేతకు కానుకగా ఇస్తామని మంత్రి వెల్లడించారు. నగరంలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటి, రెండేళ్లలో 5 లక్షల చెట్లు పెంచి నగరాన్ని పచ్చదనంలో కప్పేస్తామని స్పష్టం చేశారు. పచ్చని తెలంగాణ కోసం సీఎం చేస్తున్న తపస్సులో భాగస్వాములు కావాలని నగర ప్రజలేకాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.  


హుజూరాబాద్‌లో మంత్రి ఈటల, వినోద్‌, కెప్టెన్‌.. 

హుజూరాబాద్‌ టౌన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం హుజూరాబాద్‌లో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ వీ లక్ష్మీకాంతారావులు పాల్గొననున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌, రైస్‌ మిల్లర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లెపు మోహన్‌రావు ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ముందుగా ఉదయం 9గంటలకు పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 66కిలోల కేక్‌ కటింగ్‌ కార్యక్రమంలో, ఆ తర్వాత మొక్కలు నాటే కార్యక్రమంలో, అనంతరం సిర్సపల్లిలో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.


logo