శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 17, 2020 , 03:15:17

సింగిల్‌ విండోలపై గులాబీ జెండా

సింగిల్‌ విండోలపై గులాబీ జెండా

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార సంఘాలన్నింటిలో మెజార్టీ డైరెక్టర్‌ స్థానాలకు గెలుచుకుని అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కూడా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సొంతం చేసుకున్నది. 30 సంఘాలకుగానూ ఆదివారం 29 సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి. శంకరపట్నం మండలం తాడికల్‌ సహకార సంఘంలో కోరం లేక పోవడంతో సోమవారానికి ఎన్నికను వాయిదా వేశారు. నుస్తులాపూర్‌లో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరగలేదు. మిగతా అన్ని సంఘాల్లో ఎన్నిక జరిగిన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. డైరెక్టర్‌ పదవులను ఏకగ్రీవం చేసుకున్నపుడే టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది. ఇక శనివారం జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో అన్ని సంఘాల్లోనూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనమే అయ్యింది. 29 అధ్యక్ష పదవులు, 28 ఉపాధ్యక్ష పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. దీంతో టీఆర్‌ఎస్‌ నేతలు సంబురాల్లో మునిగితేలారు. 


కుతంత్రాలను తిప్పికొట్టి.. 

డైరెక్టర్‌ స్థానాలను గెలుచుకోవడంలో చతికిలపడిన ప్రతిపక్షాలు సహకార సంఘాల అధ్యక్ష, ఉపాధ్య పదవులను అడ్డదారిలో కాజేసే ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయి. సైదాపూర్‌ సంఘంలో కేవలం మూడు డైరెక్టర్‌ స్థానాలను మాత్రమే గెలుచుకున్న బీజేపీ 10 స్థానాల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌తో పోటీ పడింది. ఓటమి తప్పదని తెలిసినా ఉనికి కోసం ఇక్కడ పోటీలో ఉండడంతో అధికారులు రహస్య ఓటింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. గంగాధరలో ఓ వర్గం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా డైరెక్టర్లను కూడగట్టి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కాజేసే ప్రయత్నం చేసింది. ఈ సంఘంలో 9 డైరెక్టర్‌ పదవులను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకునేందుకు స్పష్టమైన మెజార్టీ సాధించింది. 


కానీ స్థానికత పేరిట రెచ్చగొట్టిన కొందరు.. ఇద్దరు టీఆర్‌ఎస్‌ డైరెక్టర్లను తమవైపు తిప్పుకుని రెండు పదవులకు నామినేషన్లు వేయించారు. కానీ, టీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్న మరో ఏడుగురు డైరెక్టర్లతో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఆ పార్టీ కైవసం చేసుకోవడంతో వైరి వర్గం నాయకులు ఏం చేయలేకపోయారు. తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌, హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లిలో టీఆర్‌ఎస్‌ డైరెక్టర్ల మధ్య స్థానికత పేరిట పోటీ అనివార్యమైంది. కొక్కెరకుంటలో అధ్యక్ష పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరిగినా ఉపాధ్యక్ష పదవి కోసం ఇద్దరు టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య పోటీ కారణంగా ఇక్కడ కూడా రహస్య ఓటింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. 


దేవంపల్లిలో కాంగ్రెస్‌ కుట్ర భగ్నం..  

మానకొండూర్‌ మండలం దేవంపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ కుట్రలను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు భగ్నం చేశారు. మూడు గ్రామాల పరిధిలో ఉన్న ఈ సంఘానికి టీఆర్‌ఎస్‌ బలపర్చిన 10 మంది డైరెక్టర్లు గెలిచారు. కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు ముగ్గురు మాత్రమే గెలిచారు. అయితే తమ పార్టీ మద్దతుతో కసిరెడ్డి లత అధ్యక్షురాలిగా, పాకాల రాజేందర్‌ రెడ్డి ఉపాధ్యక్షుడిగా గెలిచారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ ఈ ఇద్దరికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి దేవంపల్లి సంఘాన్ని తామే గెలిచామని పత్రికలకు చెప్పుకున్నారని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యుడు తాళ్లపల్లి శేఖర్‌గౌడ్‌ ఆరోపించారు. నిజానికి అభినందించేందుకు వచ్చిన కవ్వంపల్లి వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పారని స్థానికులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. 


అయితే, జిల్లాలో ఏకైక మహిళా అధ్యక్షురాలిగా గెలిచిన కసిరెడ్డి లత తనకు తెలియకుండానే, తన అంగీకారం లేకుండానే కాంగ్రెస్‌ కండువా కప్పారని వాపోయారు. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు ఆమెను స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ వద్దకు తీసుకెళ్లి తిరిగి టీఆర్‌ఎస్‌ కండువా కప్పారు. దీంతో ఈ స్థానం కూడా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ నాయకులు నీచమైన రాజకీయానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పది మంది డైరెక్టర్లు తమ పార్టీకి ఉండగా కేవలం ముగ్గురు సభ్యులు ఉన్న కాంగ్రెస్‌ మద్దతు తమకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ డైరెక్టర్లను మభ్యపెట్టి కవ్వంపల్లి సత్యనారాయణ ఇలాంటి నీచమైన రాజకీయానికి దిగజారారని ధ్వజమెత్తారు. 

 

చైర్మన్లుగా గెలిచిన మాజీ జడ్పీటీసీలు.. 

రైతులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు పదవులు నిర్వహించిన పలువురు నాయకులు సహకార సంఘాలకు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇది వరకు శంకరపట్నం జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన పొద్దుటూరి సంజీవరెడ్డి ఇదే మండలంలోని మెట్‌పల్లి సహకార సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సైదాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన బిల్ల వెంకటరెడ్డి ఇదే మండలంలోని వెన్నంపల్లి సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక గంగాధర సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన దూలం బాలాగౌడ్‌ కూడా ఇది వరకు ఈ మండలానికి ఎంపీపీగా పనిచేశారు. మానకొండూర్‌ మండలం దేవంపల్లి సహకార సంఘానికి కేసిరెడ్డి లత అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. జిల్లాలో ఈమె ఒక్కరే మహిళా అధ్యక్షురాలిగా ఉండడం విశేషం. కాగా జూపాక రజిత, వీణవంక సంఘానికి గాజుల మేరి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.


logo