ఆదివారం 24 మే 2020
Karimnagar - Feb 16, 2020 , 03:07:30

‘గులాబీ’కే సహకారం

‘గులాబీ’కే సహకారం

(కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి/ కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)తమ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్షాన్నే రైతులు మరోసారి నిలిచారు. రైతుబంధు, రైతు బీమా, సకాలంలో విత్తనాలు, ఎరువులు, 24గంటలపాటు ఉచితంగా నాణ్య మైన విద్యుత్‌ అందిస్తున్న ప్రభుత్వానికి రైతులు సహకార ఎన్నికల్లో వెన్ను దన్నుగా నిలిచారు. రైతుల దెబ్బకు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ, తదితర పార్టీలు బేజారైపోయాయి. ఒక్క సంఘంలోనూ కనీస ప్రభావం చూపలేక పోయాయి. నామినేషన్ల పర్వం ముగియగానే జమ్మికుంట మండలం తనుగులను ఏకగ్రీవం చేసుకుని బోణీ కొట్టిన అధికార టీఆర్‌ఎస్‌ 30 సంఘాల పరిధిలో 385 డైరెక్టర్‌ స్థానాలకు 168 ఏకగ్రీవమైతే ఇందులో 166 టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. మిగిలిన 217 స్థానాల్లో ఎన్నికలు జరగగా, ఇందులోనూ స్పష్టమైన మెజార్టీ సాధించి తమకు ఎదురు లేదని టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటుకు న్నారు. మొత్తంగా చూస్తే 345 డైరెక్టర్‌ పదవుల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ అన్ని సంఘాల్లో స్పష్టమైన మెజార్టీని సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు కేవ లం 17, బీజేపీకి 9, సీపీఐకి ఒక్క చిగురుమామిడి సంఘంలోనే 4 స్థానాలు గెలుచుకోగా మరో 9స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు.


ప్రతిపక్షాలకు చోటేలేదు..

కొన్ని సంఘాల్లో అయితే అసలు ప్రతిపక్షాలకు చోటే లేకుండా పోయింది. కరీంనగర్‌ మండలం దుర్షేడ్‌, మానకొండూర్‌ మండలం ఊటూరు, తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌, చొప్పదం డి, రామడుగు, ఇదే మండలంలోని కొక్కెర కుం ట, ఇల్లందకుంట, ఇదే మండలంలోని మత్యాల, జమ్మికుంట, ఇదే మండలంలోని తనుగుల (ఏకగ్రీవం) సంఘాల్లో ఒక్క డైరెక్టర్‌ పదవిని కూడా ప్రతిపక్షాలు గెలవలేక పోయాయి. ఇక కరీంనగర్‌, మానకొండూర్‌, ఇదే మండ లంలోని దేవంపల్లి, చొప్పదండి మండలం ఆర్నకొండ, హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి, జూపాక, ఇల్లందకుంట మండలం బోగంపాడు, శంకరపట్నం మండలం తాడికల్‌, గద్దపాక సం ఘాల్లో 12 డైరెక్టర్‌ పదవులను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యత చాటుకున్నది. అలాగే గంగాధర మండలం కురిక్యాల, సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి సంఘాల్లో 11 చొప్పున డైరెక్టర్‌ స్థానాల్లో, గంగాధర, హుజూరాబాద్‌, వీణవంక మండలం ధర్మారం, సైదాపూర్‌ సం ఘాల్లో 10 చొప్పున, మానకొండూర్‌ మండ లం గట్టుదుద్దెనపల్లి, తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల, వీణవంక సంఘాల్లో 9 చొప్పున, చిగురుమామిడి సంఘంలో 7 చొప్పున డైరెక్టర్‌ స్థానాల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 


టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం..

జిల్లాలోని అన్ని సహకార సంఘాలను కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ నాయకుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌, హుజూరాబాద్‌లో ప్రతిప క్షాలు పూర్తిగా ఉనికి కోల్పోయే పరిస్థితి కనిపిం చింది. కరీంనగర్‌ నియోజకవర్గంలోని రెండు సంఘాలు ఉంటే రెండింటిని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం సాయంత్రం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని సహకార సంఘా ల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలు సాధించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఉన్నారని అన్నీ తానే చూసుకుంటారనే ధైర్యంతో ఎన్నిక ఏదైనా  అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ను బలప ర్చుతున్నారని అన్నారు. ఇక మరో మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబా ద్‌లోనూ అన్ని సంఘాల్లో గెలుచుకోవడం పట్ల ఆ నియోజకవర్గం నాయకులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. చొప్పదండి, మానకొండూర్‌ నియోజక వర్గాల పరిధిలోని సంఘాల్లో కూడాస్పష్టమైన మెజార్టీ రావడంతో ఇక్కడి నాయకులు కూడా సంబురాల్లో మునిగి పోయారు. ఆదివారం జరిగే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల కోసం ఆయా నియో జకవర్గాల నాయకులు కసరత్తు చేస్తున్నారు.logo