శనివారం 30 మే 2020
Karimnagar - Feb 16, 2020 , 03:05:35

రెండేళ్లలో గ్రీన్‌సిటీ

రెండేళ్లలో గ్రీన్‌సిటీ

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)రెండేళ్లలో కరీంనగర్‌ను ‘గ్రీన్‌సిటీ’గా మార్చాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశానుసారం ఆయన పుట్టిన రోజైన ఈ నెల 17న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ జిల్లాకు వచ్చినపుడు కరీంనగర్‌ పూర్తిగా కాంక్రీట్‌ జంగల్‌లా కనిపిస్తున్నదనీ, రెండేళ్లలో దీనిని గ్రీన్‌సిటీగా మార్చాలని ఆదేశాలిచ్చారని చెప్పారు. ఈ మేరకు రెండేళ్లలో 5 లక్షల మొక్కలు నాటి గ్రీన్‌సిటీగా మార్చాలని నిర్ణయించామనీ, సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన జన్మదినం రోజే ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్‌ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒకే రోజు నగరంలో 6,666 మొక్కలు నాటి కరీంనగర్‌ను గ్రీన్‌సిటీగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వివరించారు. కొత్తగా నిర్మించిన ఐటీ టవర్‌ వద్ద వెయ్యి, స్థానిక సర్కస్‌ గ్రౌండ్‌లో వెయ్యి, ఇతర ప్రాంతాల్లో మిగతా మొక్కలను నాటేందుకు మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. 


ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీనరీ పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉన్న జిల్లాను విరివిగా మొక్కలు నాటి సీఎంకే ఇష్టమైన జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. పర్యావరణంలో సీఎం కేసీఆర్‌ ఎక్కువగా నీరు, చెట్లను ఇష్టపడతారనీ, ఆయన జన్మదినం రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తమ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నాయని వివరించారు. ప్రతి కార్యకర్త మొక్కను నాటి సంరక్షించాలనీ, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. నగరంలో నిర్మాణం పూర్తైన ఐటీ టవర్‌ను ప్రారంభించేందుకు ఈ నెల 18న జిల్లాకు వస్తున్న తమ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారావు అదే రోజు కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులు, ప్రజాప్రతినిధులతో పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తారని మంత్రి గంగుల తెలిపారు. ప్రతిరోజూ తాగునీటి సరఫరాపైనా కూడా మంత్రి సమీక్షిస్తారని చెప్పారు. 


టీఆర్‌ఎస్‌ వైపే ప్రజలు

ఇక సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు సాధించిన విజయంపై మాట్లాడిన మంత్రి గంగుల జిల్లాలో ఎన్నికలు ఏవైనా ప్రజలు తమ పార్టీ వైపే ఉంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే జరిగిన వివిధ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే నిలిచారని చెప్పారు. శనివారం జరిగిన సహకార ఎన్నికల్లో కూడా ఈ విషయం మరో సారి రుజువైందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో అన్ని సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజార్టీ సాధించిందని తెలిపారు. తన నియోజకవర్గంలోని దుర్శేడ్‌లో క్లీన్‌స్విప్‌ చేయగా, కరీంనగర్‌లో 13 స్థానాలకు 12 డైరెక్టర్లను గెలిపించుకున్నామని వివరించారు. ఎన్నికలు ఏవైనా తమకు అండగా కేసీఆర్‌ ఉన్నారనే ధైర్యంతోనే ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇక దాదాపుగా ఎన్నికలు ఉండవనీ, అభివృద్ధిని సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో నగర మేయర్‌ వై. సునీల్‌ రావు, కరీంనగర్‌ జడ్పీ సభ్యురాలు పురమల్ల లలిత, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, నాయకులు చల్ల హరిశంకర్‌, గుగ్గిళ్లపు రమేశ్‌, పిట్టల రవి, పురమల్ల శ్రీనివాస్‌, తదితరులున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌, దుర్శేడ్‌ సహకార సంఘాల్లో డైరెక్టర్లుగా ఎన్నికైన వారిని మంత్రి శాలువాలతో సత్కరించారు. 


logo