శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 16, 2020 , 03:01:36

మున్సిపాలిటీల్లో వార్డు, డివిజన్‌ కమిటీలు

మున్సిపాలిటీల్లో వార్డు, డివిజన్‌ కమిటీలు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈనెల 18లోగా వార్డు, డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పట్టణ ప్రగతి సన్నాహక ఏర్పాట్లపై మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. ప్రత్యేకాధికారితో కలిసి కమిషనర్లు వార్డుల్లో పర్యటించి వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి వార్డుకు నాలుగు కమిటీలు ఉండాలన్నారు. వీరిలో యూత్‌, మహిళ, సీనియర్‌ సిటిజన్‌, ప్రామినెంట్‌ పర్సనాలిటీ కమిటీలను ఏర్పాటు చేయాలనీ, ప్రతి కమిటీలో 15 మంది సభ్యులు ఉండాలని తెలిపారు. ఈ కమిటీలు వార్డు అభివృద్ధిలో భాగస్వాములు అవుతాయని చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇంటింటికీ రూపాయి నల్లా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. వార్డుల్లో నల్లా మేళాలు నిర్వహించి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇవ్వాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో నల్లా కనెక్షన్లను ఆన్‌లైన్‌ చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి.. ఎన్నింటికి నల్లా కనెక్షన్లు ఉన్నాయన్న వివరాలు సేకరించాలన్నారు. 


మున్సిపాలిటీల్లో చెత్త సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలించేందుకు వీలుగా ఆటోలను వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇందుకు మూడు రోజుల షార్ట్‌ టైం టెండర్లను పిలువాలన్నారు. మున్సిపాలిటీల్లో 10 వేల మందికి 25 మంది పారిశుధ్య కార్మికులు ఉండాలని, లేకపోతే పట్టణ ప్రగతిలో పారిశుధ్య కార్మికులను కౌన్సిల్‌ ఆమోదం మేరకు తీసుకోవాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాలని చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించాలని ఆదేశించారు. కనీసం అదనంగా జమ్మికుంట, హుజూరాబాద్‌, చొప్పదండి పట్టణాల్లో 4 చొప్పున, కొత్తపల్లిలో ఒకటి, కరీంనగర్‌లో 10 టాయిలెట్స్‌ బ్లాక్స్‌ నిర్మించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వెంటనే నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి 10 మొక్కల చొప్పున ప్రజల డిమాండ్‌ ప్రకారమే వివిధ రకాల మొక్కలను పెంచాలని ఆదేశించారు. ఈనెల 18న మంత్రి కేటీఆర్‌ అన్ని మున్సిపల్‌ కమిషనర్లతో పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ చైర్మన్లు హాజరవుతారని తెలిపారు. సమావేశానికి కమిషనర్లు అన్ని వివరాలతో హాజరు కావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, నగర కమిషనర్‌ క్రాంతి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ చిన్నారావు, డీఈ సంపత్‌రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo