బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 13, 2020 , 04:39:56

నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌

నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • రోడ్డు మార్గాన తీగలగుట్టపల్లికి చేరిన ముఖ్యమంత్రి
  • పర్యవేక్షించిన కలెక్టర్‌ శశాంక, ఇన్‌చార్జి సీపీ సత్యనారాయణ
  • ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకుల ఘన స్వాగతం
  • కేసీఆర్‌ భవన్‌లో రాత్రి బస
  • నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటన
  • కాళేశ్వరంలో పూజలు, లక్ష్మీ బరాజ్‌ సందర్శన
  • అన్ని ఏర్పాట్లూ పూర్తి


కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కరీంనగర్‌ క్రైం కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం రాత్రి 10.53 గంటలకు రోడ్డు మార్గాన కరీంనగర్‌ చేరుకున్నారు. నేరుగా తీగలగుట్టపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. సీఎం వెంట మంత్రి గంగుల కమలాకర్‌ తదితరులున్నారు. కలెక్టర్‌ కే శశాంకతోపాటు జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌ రావు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌ రెడ్డి, నగర మేయర్‌ వై సునీల్‌ రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, మాజీ మేయర్‌, కార్పొరేటర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, తదితరులు సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. కాగా, ఇన్‌చార్జి సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  


నేటి పర్యటన ఇలా..

బుధవారం రాత్రి కేసీఆర్‌ భవన్‌లో బస చేసిన ముఖ్యమంత్రి, గురువారం లక్ష్మీబరాజ్‌ను సందర్శించనున్నారు. ముందుగా ఉదయం 8.50 గంటలకు తీగలగుట్టపల్లి నుంచి బయలు దేరి, 9 గంటలకు కరీంనగర్‌ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 9.05 గంటల నుంచి హెలీకాప్టర్‌లో బయలు దేరి, 9.30 వరకు పూర్వ ఉమ్మడి జిల్లా, ప్రస్తుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం హెలీప్యాడ్‌కు 9.35 గంటలకు చేరుకుంటారు. 9.40 గంటలకు కాళేశ్వరం దేవాలయానికి చేరుకొని, 10.10 గంటల వరకు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని, గోదావరి ఘాట్‌ను సందర్శిస్తారు. 10.15 గంటలకు అక్కడి హెలీప్యాడ్‌కు వెళ్తారు. 10.20 గంటలకు బయలుదేరి 10.30 వరకు అంబటిపల్లిలోని లక్ష్మీ బరాజ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడే భోజనం చేసి, 2 గంటలకు లక్ష్మీ బరాజ్‌ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 2.25 గంటల వరకు కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకుని, 2.30 నుంచి 2.40 వరకు తీగలగుట్టపల్లికి వస్తారు. సమయాన్ని బట్టి హైదరాబాద్‌ ప్రగతి భవన్‌కు బయలు దేరుతారు.


ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్‌.. 

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కే శశాంక అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నగర శివారులోని కేసీఆర్‌ భవన్‌లో సీఎం రాత్రి బస చేస్తారనీ, గురువారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారని చెప్పారు. ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ప్రత్యేక రూం ఏర్పాటు చేయాలనీ, రాత్రి సమయంలో ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్‌తో డాక్టర్ల బృందాన్ని పంపించాలనీ, కాన్వాయ్‌లో, కలెక్టరేట్‌ హెలీప్యాడ్‌లో, తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌ వద్ద అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్‌ హెలీప్యాడ్‌లో తాత్కాలిక టాయిలెట్‌ రూం ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు డిపార్టుమెంటల్‌ నోట్స్‌తో సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌, నగరపాలక సంస్థ ఎస్‌ఈ భద్రయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌, అర్బన్‌ తాసిల్దార్‌ వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


కేసీఆర్‌ భవన్‌ వద్ద భారీ భద్రత..

సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం సాయంత్రం నుంచే భారీ బందోబస్తు నిర్వహిస్తున్నది. రహదారి మార్గం గుండా సీఎం జిల్లాకు రావడంతో అడుగడుగునా భద్రతా చర్యలు చేపట్టింది. నగరం నుంచి తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌ వరకు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలీసులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని సూక్ష్మ తనిఖీలు చేశారు. డాగ్‌ స్కాడ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేయగా, కరీంనగర్‌ ఇన్‌చార్జి సీపీ సత్యనారాయణ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్‌ భవన్‌ వద్ద స్వయంగా బందోబస్తును పరిశీలించారు. సీపీ పర్యవేక్షణలో డీసీపీలు, ఎసీపీలు, సిబ్బంది పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. logo