శనివారం 30 మే 2020
Karimnagar - Feb 12, 2020 , 01:39:23

ప్రభుత్వ పథకాల అమలుపై దిశానిర్దేశం

ప్రభుత్వ పథకాల అమలుపై దిశానిర్దేశం

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాల అమలుపై సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు మంగళవారం దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో వారితో సమావేశమైన ముఖ్యమంత్రి అనేక విషయాలపై వారితో చర్చించారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌ హాజరయ్యారు. ఎవరు చేయాల్సిన పనులు వారితోనే చేయించాలని సూచించారు. ఎవరి ప్రాధాన్యత వారు ఎంచుకోవద్దని సూచించిన ఆయన, అధికారులంతా టీమ్‌గా పనిచేయాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన కొంత కాలంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందనీ, చాలా తక్కువ సమయంలో విద్యుత్తు సమస్యను అధిగమించి ఇపుడు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయడం గర్వకారణమని వివరించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నామని వెల్లడించారు. గతంలో కలెక్టర్లు 112 కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరించేవారనీ, ఇపుడు వాటిని 26కు కుదించడం వల్ల పని భారం తగ్గిందని చెప్పారు. గ్రామీణ వ్యవస్థలో అన్ని స్థాయిల్లోని పోస్టులను భర్తీ చేశామనీ, ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించామనీ, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారాలను కలెక్టర్లకు ఇచ్చామని వివరించారు. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల బాధ్యతలను ఒక అడిషనల్‌ కలెక్టర్‌కు అప్పగించాలనీ, వారికి మరో పని చెప్పవద్దని సూచించారు. వచ్చే 15 రోజుల్లో పంచాయతీ రాజ్‌ సమ్మేళనం నిర్వహించి సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ ఎవరు ఏమి చేయాలో వివరించాలనీ, ఆ తర్వాత 25 రోజుల్లో గ్రామాల పరిస్థితుల్లో పూర్తి మార్పు రావాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్కాడ్‌ల ద్వారా తనిఖీలు చేయిస్తామని, తాను కూడా తనిఖీలు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలతోపాటు కరీంనగర్‌లో అడవుల శాతం తక్కువగా ఉందనీ, ఇక్కడ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీఎం సూచించారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత మంత్రులు, కలెక్టర్లదేననీ, సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్‌ శాఖలో ఖాళీలు భర్తీ చేసినట్లుగానే మున్సిపాలిటీల్లోనూ భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నప్పటికి అక్షరాస్యతలో వెనకబడి ఉందని, గ్రామాల్లో అక్షరాస్యతను పెంచే బాధ్యతలను సర్పంచులకు అప్పగించాలని కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల వ్యవస్థను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లదేననీ, రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలోనే ఉంటుందన్నారు. అన్ని పట్టణాల్లో విధిగా పబ్లిక్‌ టాయిలెట్లు, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు నిర్వహించాలనీ, వీధుల వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ప్రత్యామ్నాయం చూపకుండా బలవంతంగా తరలించవద్దని చెప్పారు. జిల్లాల వారీగా ఫారెస్టు బ్లాక్‌లను గుర్తించి అడవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలను పెంచేందుకు ఉపాధి నిధులను వినియోగించాలని సూచించారు.


logo