గురువారం 28 మే 2020
Karimnagar - Feb 11, 2020 , 01:52:46

ఏకగ్రీవం @168

ఏకగ్రీవం @168

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):జిల్లాలో మొత్తం 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 385 ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి 1,503 నామినేషన్లు వచ్చాయి. ఆదివారం అధికారులు నామినేషన్ల పరిశీలన జరిపారు. ఇందులో 19 నామినేషన్లను తిరస్కరించారు. 113 డబుల్‌ నామినేషన్లను తొలిగించారు. ఇక 1,371 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగగా, 614 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ కారణంగా 168 నియోజకవర్గాల్లో సింగిల్‌ నామినేషన్లు మాత్రమే మిగలడంతో వీరిని ఏకగ్రీవమైనట్లు ఆయా సంఘాల ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక మిగిలిన 217 నియోజకవర్గాల్లో 757 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 

ప్రతి సంఘంలో ఏకగ్రీవాలు.. 

జిల్లాలోని ఒక్క చిగురుమామిడి సంఘంలో మినహా మిగతా అన్ని సంఘాల్లో పలు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. జమ్మికుంట మండలం తనుగుల సహకార సంఘం పూర్తిగా ఏకగ్రీవం కాగా, జమ్మికుంటలో 12, తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌లో 11, ఇల్లందకుంటలో 10, చొప్పదండి మండలం ఆర్నకొండలో 9, రామడుగులో 8, ఇల్లందకుంట మల్యాలలో 8, కరీంనగర్‌లో 7, దుర్శేడ్‌లో 7, చొప్పదండిలో 7, జమ్మికుంట మండలం ధర్మారం, తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల, గంగాధర, హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి, రామడుగు మండలం కొక్కెరకుంట సహకార సంఘాలు ఒక్కో దానిలో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, హుజూరాబాద్‌ మండలం జూపాక, సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి, మానకొండూర్‌ మండలం దేవంపల్లిలో ఐదేసి స్థానాలు, హుజూరాబాద్‌లో 4 స్థానాలు ఏకగ్రీవంకాగా, మానకొండూర్‌, గంగాధర మండలం కురిక్యాల, శంకరపట్నం మండలం తాడికల్‌, మెట్‌పల్లి, సైదాపూర్‌లో మూడేసి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక వీణవంక, మానకొండూర్‌ మండలం ఊటూరులో రెండేసి స్థానాలు, మానకొండూర్‌ మండలం గట్టుదుద్దెనపల్లి, శంకరపట్నం మండలం గద్దపాకలో ఒక్కో స్థానం ఏకగ్రీవమయ్యాయి. 

ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌దే హవా.. 

సహకార సంఘాల ఎన్నికల్లో మరోసారి అధికారపార్టీ ప్రభావం కనిపిస్తున్నది. జిల్లాలో మొత్తం 385 నియోజకవర్గాలుండగా, 168 స్థానాలు ఏకగ్రీమయ్యాయి. ఇందులో 166 చోట్ల టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులే ఉన్నారు. పది సంఘాల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్నది. మంత్రి గంగుల కమలాకర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంగనగర్‌ మండలంలోని రెండు సంఘాల్లో టీఆర్‌ఎస్‌ హవా కనిపించింది. కరీంనగర్‌ సంఘంలో మొత్తంలో 13 స్థానాలు ఉండగా 7, దుర్శేడ్‌లో 13 స్థానాలకు 7 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం తనుగులలో 12 స్థానాలను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం చేసుకుని సహకార సంఘాన్ని కైవసం చేసుకుంది. ఇల్లందకుంటలో 10, ఇదే మండలం మల్యాలలో 8, బోగంపాడులో 7, జమ్మికుంటలో 12, ధర్మారంలో 6, హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లిలో 6, జూపాకలో 5 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఈ సంఘాలను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండిలో 7, ఆర్నకొండలో 9, రామడుగులో 8, గంగాధరలో 6, కొక్కెరకుంటలో 6 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న టీఆర్‌ఎస్‌ ఈ నియోజకవర్గంలో కూడా హవా కొనసాగించింది. మానకొండూర్‌ నియోజకవర్గంలోని నుస్తులాపూర్‌లో 11, పొరండ్లలో ఆరు స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న టీఆర్‌ఎస్‌ ఈ సంఘాలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది.


logo