శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 11, 2020 , 01:50:57

యువతకు మంచి అవకాశం

యువతకు మంచి అవకాశం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: ఐటీ టవర్‌తో స్థానిక యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని రూపుదిద్దుకున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సోమవారం ఆయన, కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని నూతన ఐటీ టవర్‌ పనులను పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము మొదట చిన్నగా ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలనుకున్నామనీ, కానీ ఇప్పుడు అనేక కంపెనీలు పెట్టుకునే టవర్‌గా రూపుదిద్దుకున్నదని హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక స్థలం ఉన్న టవర్‌ ఇదేననీ, ప్రారంభోత్సవంతోనే ఎక్కువ కంపెనీలకు స్థలం కేటాయిస్తున్నామని చెప్పారు. స్థానికంగా ఉన్న ఎంతో మంది యువతీయువకులకు ఇక్కడ ఉపాధి అవకాశాలుంటాయన్నారు.

18న ఐటీ టవర్‌ ప్రారంభం : మంత్రి గంగుల కమలాకర్‌ 

జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ జిల్లాకేంద్రంలో ఈ టవర్‌ను నిర్మించారనీ, ఇది కరీంనగర్‌కు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు. ఐటీ టవర్‌ పనులను పరిశీలించిన తర్వాత, విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ప్రస్తుతం 26 కంపెనీలు తమను సంప్రదించాయనీ, ఇప్పటికే 15 కంపెనీలకు టవర్‌లో స్థల కేటాయింపులు చేశామని వివరించారు. ఈ టవర్‌ నిర్మాణ శంకుస్థాపన సమయంలోనే 12 కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీ టవర్‌లో ఏర్పాటు చేసే సంస్థలకు ఇన్సెంన్టివ్స్‌ అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే స్థల కేటాయింపు చేసిన కంపెనీల్లో 506 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ టవర్‌లో ఏర్పాటు చేసే సంస్థల్లో 80 శాతం మేరకు స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించే విధంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ మూడు షిఫ్టుల్లో 3 వేల మందికిపైగా ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తే వచ్చే యేడాదిలో మరో టవర్‌కు డిమాండ్‌ వచ్చేలా ఉందనీ, దీనికి కూడా స్థల కేటాయింపులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న టవర్‌లో 62వేల ఎస్‌ఎఫ్‌టీ స్థలం ఉందని చెప్పారు. సెల్లార్‌లో పూర్తిగా పార్కింగ్‌కు చర్యలు తీసుకున్నామనీ, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి అంతస్తు నుంచి 5వ అంతస్తు వరకు వివిధ కంపెనీలకు స్థల కేటాయింపులు చేస్తున్నామని వివరించారు. ఇంకా దీనిలో సగం స్థలం ఉంచామనీ, ఇందులో మల్టీనేషనల్‌ కంపెనీలను తీసుకువచ్చేందుకు దృష్టి పెడుతున్నామన్నారు. త్వరలోనే తాము అమెరికాలో పర్యటించి పెద్ద కంపెనీలను కూడా ఇక్కడకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. తాము అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, స్థానికంగా చదువుకున్న యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో ఉన్నామన్నారు. ‘గల్ఫ్‌ ఎందుకు దండగ.. కేసీఆర్‌ ఉండగా’ అన్న నినాదం వచ్చేలా తాము స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ, ఇందు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. టవర్‌ ప్రారంభోత్సవంతోనే 60 శాతానికి పైగా స్థలాన్ని కంపెనీలకు కేటాయించడం ఇక్కడ మాత్రమే సాధ్యమైందన్నారు. వారి వెంట ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై సునీల్‌రావు, నాయకులు ఆరెపల్లి మోహన్‌, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, చల్ల హరిశంకర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.


logo