ఆదివారం 31 మే 2020
Karimnagar - Feb 11, 2020 , 01:48:57

ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణింపు

ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణింపు

కరీంనగర్‌ హెల్త్‌ : పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని కలెక్టర్‌ కే శశాంక అన్నారు. సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నగరంలోని ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నులి పురుగుల నిర్మూలన (అల్బెండజోల్‌) మాత్రల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొందరు పిల్లలు ఎత్తు, బరువు పెరగడం లేదని, నీరసం అనారోగ్యంతో బాధపడుతుంటారని, అందుకు మూల కారణం పిల్లల కడుపులో నట్టలు, పురుగులు ఉండడమేనన్నారు. పిల్లలు తీసుకునే ఆహారాన్ని మొత్తం ఈ నట్టలు, పురుగులు తీసుకుని పిల్లల అనారోగ్యానికి కారణమవుతాయని, అందుకే వాటిని బయటికి పంపించేందుకే ప్రభుత్వం అల్బెండజోల్‌ మాత్రలు వేయిస్తున్నదని తెలిపారు. 1-19 ఏండ్ల వయస్సు గల వారందరూ ఈ మాత్రలు వేసుకోవాలని, అప్పుడే పిల్లలకు కడుపునొప్పి అనారోగ్యం లాంటి సమస్యలు రావన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ చదువుల్లో రాణిస్తారని  చెప్పారు. విద్యార్థులు భోజనం చేసే ముందు చేతులు సబ్బుతో శుభ్రపరుచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. విద్యార్థులు విద్యతో పాటు చక్కని క్రమశిక్షణ అలవరుచుకోవాలన్నారు. నగర మేయర్‌ వై సునీల్‌రావు మాట్లాడుతూ పిల్లలు నట్టల నివారణ మాత్రలు వేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. శారీరక ఎదుగుదల బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత, జిల్లా విద్యాధికారి దుర్గా ప్రసాద్‌, కార్పొరేటర్‌ పెద్దపల్లి జితేందర్‌, డెమో దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు. 


logo