గురువారం 28 మే 2020
Karimnagar - Feb 11, 2020 , 01:47:27

విద్య, వైద్య విధానాల్లో మార్పులు తెస్తాం

విద్య, వైద్య విధానాల్లో మార్పులు తెస్తాం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో విద్య, వైద్యం, ఆరోగ్య విధానాల్లో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం కరీంనగర్‌కు వచ్చిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని మేయర్‌ వై సునీల్‌రావు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఆయన మేయర్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ మేయర్‌గా నగర ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు. ప్రజలు కోరుకునే స్మార్ట్‌ సిటీ కలను త్వరగా నెరవేర్చాలన్నారు. వాటికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘం ప్రతినిధులు ఉద్యమ స్ఫూర్తితో ప్రజలకు సేవలందించాలని సూచించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు, ప్రజలకు మంచి పాలన అందించే దిశగా రెవెన్యూ చట్టాలను మార్చుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో అక్షరాస్యత శాతం తగ్గిందని, దానిని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలకు ఉద్యోగ సంఘాలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తూం రవీందర్‌, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌, ఉపాధ్యక్షుడు రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.logo