శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 10, 2020 , 01:27:57

జీవులన్నింటిలోనూ దేవుడు

జీవులన్నింటిలోనూ దేవుడు

జమ్మికుంట : జీవులన్నింటిలోనూ దేవుడున్నాడనీ, హరినామాన్ని స్మరించి తరించాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి భక్తులకు ఉపదేశించారు. జమ్మికుంట పట్టణంలోని పద్మావతి, గోదా సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు ముక్కా జితేందర్‌ గుప్తా, సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ అర్చకులు హరికృష్ణమాచార్యులు, వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో యాగశాలలో చతుస్థానార్చణ, నిత్య హోమం, గోమాత తులాభారం, వైనతేయ ఇష్ఠి, పూర్ణాహుతి, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు చేశారు. అనంతరం స్థానిక జడల రామలింగం నివాసంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, మాట్లాడారు. అన్ని కులాలను, మతాలను గౌరవించాలని చినజీయర్‌స్వామి సూచించారు. ప్రతి మనిషి కూడా ప్రేమించే తత్వాన్ని అలవర్చుకోవాలనీ, అహం, ద్వేషం, కోపం, మోసాలకు దూరంగా ఉండాలన్నారు. మనిషి కూడా మహానుభావుడిగా మారే అవకాశం ఉందనీ, మన ఆహారపు అలవాట్ల వల్లనే మనుషులు మారిపోయారని చెప్పారు. సమాశ్రయణాలు పాటించాలని పేర్కొన్నారు. అందరూ బొట్టు పెట్టుకోవాలనీ, సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సాయంత్రం గరుడ వాహన సేవ, సామూహిక శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం, యాగశాలలో చతుస్థానార్చణ, పూర్ణాహుతి, తీర్థ ప్రసాత వితరణతో కార్యక్రమాలు ముగిశాయి.


logo