గురువారం 28 మే 2020
Karimnagar - Feb 10, 2020 , 01:43:10

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తాం

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తాం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : వచ్చే ఐదేళ్లల్లో కరీంనగర్‌ రూపురేఖలు మార్చి రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఆదివారం నగర డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి మంత్రి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడారు. ఇప్పటికే నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.350 కోట్ల నిధులు మంజూరు చేసిందనీ, వీటితో అనేక పనులు పూర్తయ్యాయనీ, మిగిలినవి వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నూతన పాలకవర్గం నీతిమంతమైన, జవాబుదారీతనంతో పాలన అందించాలని సూచించారు. నగరంలో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. 60 డివిజన్లలో ఇంకా 50 డివిజన్లు పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదనీ, విలీన గ్రామాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. స్మార్ట్‌సిటీలో భాగంగా రోడ్లను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుతం ఉన్న ఐఎంఎఫ్‌ఎల్‌ డిపో ప్రాంతంలో భారీగా కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా ఏప్రిల్‌ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నగరంలో రోజూ నీటి సరఫరా చేస్తామనీ, ఎల్‌ఎండీలో ఎప్పుడూ 15 టీఎంసీల నీరు ఉండేలా చూస్తామనీ, నగర ప్రజలకు 24 గంటల నీటి సరఫరా అందించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. డంప్‌యార్డులోని చెత్తను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాదిలోగా క్లీన్‌ చేస్తామన్నారు. ఈ నెల 12న ఢిల్లీ వెళ్తున్నామనీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి స్మార్ట్‌సిటీ రెండో దశ పనులకు ప్రణాళికలను సిద్ధం చేస్తామని వెల్లడించారు. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పూర్తిగా ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామనీ, ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేయడమా..? లేక దానిని కలుపుకొని నిర్మాణాలు చేయడామా? అనే విషయంలో త్వరలోనే నీట్‌ కళాశాల ద్వారా పరిశీలన చేయిస్తామన్నారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు త్వరలోనే చేపట్టడంతో పాటు నగరాన్ని పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. మున్సిపల్‌లో పనులు జరుగుతాయన్న నమ్మకం కలిగేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని పాలకవర్గానికి సూచించారు.

స్మార్ట్‌సిటీలో భాగంగా తెలంగాణ తల్లి, తెలంగాణ చౌరస్తాలను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్ట్స్‌ కళాశాల, సర్కస్‌గ్రౌండ్‌లో చేపట్టిన పనులను వేగవంతం చేస్తామన్నారు. నగరపాలక సంస్థలో సీడీఎంఏ అనుమతులు లేకుండా పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి, మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సీడీఎంఏ నుంచి అనుమతి లేకుండా ఎవ్వరినీ తీసుకునే వీలులేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, నగర మేయర్‌ వై సునీల్‌రావు, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

డిప్యూటీ మేయర్‌ బాధ్యతల స్వీకరణ 

డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి నగరపాలక సంస్థలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి గంగుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు మంత్రితోపాటు ఎమ్మెల్సీ, మేయర్‌, సుడా చైర్మన్‌, పలువురు కార్పొరేటర్లు అభినందనలు తెలిపారు. నగర కమిషనర్‌ వల్లూరి క్రాంతి ఆమెకు మొక్క అందించారు.


logo