గురువారం 28 మే 2020
Karimnagar - Feb 10, 2020 , 01:23:36

నైతిక విలువల బోధనతోనే నేరాల నియంత్రణ

నైతిక విలువల బోధనతోనే నేరాల నియంత్రణ

హౌసింగ్‌బోర్డు కాలనీ: నైతిక విలువల బోధనతోనే నేరాలను నియంత్రించ వచ్చని జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయసాహితీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దిశానిర్దేశం’ కవితా సంకలనం ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్ననాటినుంచే పిల్లలకు చదువుతోపాటు సంస్కారం నేర్పాలని సూచించారు.  ఉమ్మడి కుటుంబాల ద్వారానే పిల్లలకు మంచి అలవాట్లు వస్తాయని పేర్కొన్నారు. పిల్లల వ్యవహార శైలిపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలనీ,  సెల్‌ఫోన్లకు బానిసలై వారు చెడు అలవాట్లకు లోను కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. విశిష్ట అతిథులుగా హాజరైన ప్రముఖ కవి, విమర్శకుడు దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై తక్షణ చర్యలు తీసుకునే విధంగా చట్టాల్లో మార్పురావాలని కోరారు. మరో అతిథిగా హాజరైన జబర్దస్త్‌ ఫేం లక్ష్మీకిరణ్‌ మాట్లాడుతూ, పిల్లల్ని సంస్కారవంతుల్ని చేసే బాధ్యత తల్లిదండ్రులేదనన్నారు.  కవితా సంకలనం తీసుకువచ్చిన వైరాగ్యం ప్రభాకర్‌ అభినందనీయుడన్నారు. అనంతరం ఉదయ సాహితీ అధ్యక్షుడు డాక్టర్‌ వైరాగ్యం ప్రభాకర్‌ మాట్లాడుతూ, సంస్థ చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సాహితీ గౌతమి సహాధ్యక్షుడు సుదర్శనం వేణుశ్రీ, ఏ గజేందర్‌రెడ్డి, రేగులపాటి విజయలక్ష్మి, బొమ్మకంటి కిషన్‌, వెల్ముల జయపాల్‌రెడ్డి, వెగ్గలం ఉషశ్రీ, గుండు రమణయ్య, అనుశ్రీ, నాగవేణి, బాల్‌రెడ్డి, వసంత, మాడిశెట్టి గోపాల్‌, జక్కు కృష్ణమూర్తి, నసీరొద్దీన్‌, నడిమెట్ల రామయ్య, రామస్వామి, సీహెచ్‌ దేవశంకర్‌, కే శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. 


logo