గురువారం 28 మే 2020
Karimnagar - Feb 09, 2020 , 02:02:36

నిధుల అభివృధి నాది అభివృధి మీది

నిధుల అభివృధి నాది అభివృధి మీది
  • నగరాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలి
  • నగర మేయర్‌గా వై సునీల్‌రావు బాధ్యతల స్వీకరణ
  • ‘పది’ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంపై తొలి సంతకం
  • జవాబుదారీతనంతో పనిచేయాలి
  • స్థానిక సంస్థల్లో జోక్యం చేసుకునే అవసరం రాకుండా చూసుకోవాలి
  • మంత్రి గంగుల కమలాకర్‌
  • నూతన పాలకవర్గానికి దిశానిర్దేశం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై నమ్మకంతో నగరపాలక సంస్థలో టీఆర్‌ఎస్‌కు అత్యధిక మెజార్టీ ఇచ్చారనీ, వారి నమ్మకం వమ్ము కాకుండా పాలకవర్గం పని చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. నగర మేయర్‌ వై సునీల్‌రావు బాధ్యతల స్వీకరణ అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌ ప్రజలు ఇప్పటి వరకు తనకు ఓటమి లేకుండా గెలిపించారనీ, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని స్పష్టంచేశారు. ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారన్న విషయంలో ప్రజలు ప్రతీక్షణం గమనిస్తారనీ, ఎన్నికల వరకే రాజకీయాలనీ, గెలిచిన తర్వాత 60 మంది పాలకవర్గ సభ్యులేనని చెప్పారు. పదవులు అలంకారప్రాయం కావద్దనీ, అహంకారం ఉండవద్దని సూచించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. నూతన మేయర్‌, పాలకవర్గం నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకపోవడంతోపాటు పారదర్శకంగా, నిజాయితీగా పాలన అందిస్తారన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని స్పష్టం చేశారు. 


స్థానికంగా చేపట్టే కార్యక్రమాలు ప్రభుత్వంపై ప్రభావం చూపుతాయనీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పని చేయాలన్నారు. నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 350 కోట్ల నిధులు ఇచ్చిందనీ, గత నాలుగేళ్లలో ప్రధాన రహదారులు అభివృద్ధి అయ్యాయనీ, ఇంకా కావాల్సింది ఉందన్నారు. నగరాభివృద్ధిలో విపక్ష కార్పొరేటర్లు కూడా కలిసిరావాలని కోరారు. నగరంలో ఇప్పటికే ఐటీ టవర్‌ పూర్తయిందనీ, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అలాగే కేబుల్‌ బ్రిడ్జి పనులు పూర్తి కావస్తున్నాయనీ, త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మానేరు రివర్‌ఫ్రంట్‌ అద్భుతమైన ప్రాజెక్టుగా నిలుస్తుందనీ, దీని వల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. స్థానిక సంస్థలకు తాము పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామనీ, ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోదనీ, ఆ అవసరం రాకుండా పని చేయాలన్నారు. తప్పు చేస్తే కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా శిక్ష పడకతప్పదని హెచ్చరించారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తామనీ, ముఖ్యంగా వేసవిలోనే రోజూ మంచినీరు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామనీ, ఇది విజయవంతమైతే వచ్చే ఆరు నెలల్లోనే 24 గంటల మంచినీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. 24 గంటల నీటి సరఫరా వల్ల నీటి వృథా తగ్గి, స్వచ్ఛమైన తాగునీరు అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో 9.5 గ్రేడు సాధించిన విద్యార్థులకు 10 వేల నగదు ప్రోత్సాహకం అందించేందుకు మేయర్‌ సునీల్‌రావు తొలి సంతకం చేయడం అభినందనీయమన్నారు.


ప్రజల మన్ననలు పొందాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

కరీంనగర్‌ ప్రజలందరి మన్ననలు పొందే విధంగా ఈ పాలకవర్గం పని చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకాంక్షించారు. గత ఐదేళ్ల కాలంలోనే నగర రూపురేఖలన్నీ మారిపోయాయనీ, రూ.వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే నగరానికి 800 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయనీ, అవన్నీ వినియోగమై పనులు పూర్తయితే నగరం మరింత ఆకర్షణీయంగా మారుతుందని చెప్పారు. ఈ దిశగానే ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. 

 

నీతిమంతమైన పాలన అందిస్తాం : నగర మేయర్‌ వై సునీల్‌రావు

రానున్న ఐదేళ్ల కాలంలో నగరపాలక సంస్థలో పారదర్శకమైన, నీతిమంతమైన అందిస్తామని మేయర్‌ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తమ పాలకవర్గం పని చేస్తుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఆలోచనలు, కార్పొరేటర్ల సమాలోచనలతో ముందుకు వెళ్తామని చెప్పారు. మున్సిపాలిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు అందించి మంచి అవకాశం అందించారనీ, దీనిని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ మెచ్చుకునే విధంగా పాలన అందిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా మంత్రి గంగుల, కార్పొరేటర్లు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా తాము పని చేస్తామన్నారు. ప్రజలు తమ పనుల  కోసం కార్యాలయం చుట్టూ తిరగకుండా సిటీజన్‌ చార్ట్‌ను తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే వేసవి నుంచే రోజూ నీటి సరాఫరా అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి రెండు నెలలకోసారి కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి గంగుల సహకారంలో నగరాభివృద్ధికి అత్యధిక నిధులు తీసుకువచ్చి మౌలికంగా ఎక్కడా సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మండలి విప్‌ భానుప్రసాద్‌రావు, ఎంఎఫ్‌సీ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, సత్యనారాయణ, 60 మంది కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.


logo