శనివారం 30 మే 2020
Karimnagar - Feb 09, 2020 , 02:01:37

385 స్థానాలు 1,503 నామినేషన్లు

385 స్థానాలు 1,503 నామినేషన్లు

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 6 నుంచి నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు మందకొడిగా సాగిన నామినేషన్లు, రెండో రోజు కాస్త పుంజుకున్నాయి. చివరి రోజైన శనివారం వెల్లువలా వచ్చి పడ్డాయి. మొదటి రోజు కేవలం 144, రెండో రోజు 438 రాగా మూడు రోజు ఏకంగా 921 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే జిల్లాలోని 30 సంఘాల పరిధిలో ఉన్న 385 ప్రాదేశిక నియోజకవర్గాలకు మూడు రోజుల్లో 1,503 నామినేషన్లు దాఖలైనట్లు డీసీఓ సీహెచ్‌ మనోజ్‌కుమార్‌ తెలిపారు. అత్యధికంగా కరీంనగర్‌ సంఘానికి 85 నామినేషన్లు వచ్చాయి. సైదాపూర్‌ సంఘానికి 77, శంకరపట్నం మండలం గద్దపాక సంఘానికి 68, ఇదే మండలంలోని మెట్‌పల్లి సంఘానికి 67, తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల సంఘానికి 65, చిగురుమామిడి సంఘానికి 64, మానకొండూర్‌ మండలం గట్టుదుద్దెనపల్లి సంఘానికి 60 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఇక అత్యల్పంగా జమ్మికుంట మండలం తనుగుల సంఘానికి 25, ఇల్లందకుంట మండలం మల్యాల సంఘానికి 27, ఇదే మండలంలోని బోగంపాడు సంఘానికి 32 నామినేషన్లు వచ్చాయి.


28 నియోజకవర్గాల్లో సింగిల్‌

జిల్లాలో నామినేషన్ల గడువు ముగిసే సరికి 28 చోట్ల సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికంగా చొప్పదండి మండలం ఆర్నకొండ సంఘం పరిధిలో 6, మానకొండూర్‌, రామడుగు మండలం కొక్కెరకుంట, ఇల్లందకుంట మండలం మల్యాల సంఘాల పరిధిలో మూడేసి, నుస్తులాపూర్‌, రామడుగు, దుర్షేడు సంఘాల పరిధిలో రెండేసి నియోజకవర్గాల్లో సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే చొప్పదండి, జమ్మికుంట మండలం తనుగుల, మానకొండూర్‌ మండలం దేవంపల్లి, తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల, శంకరపట్నం మండలం తాడికల్‌, గంగాధర, కరీంనగర్‌ సంఘాల పరిధిలో ఒక్కో నియోజకవర్గంలో సింగిల్‌ నామినేషన్లు వచ్చాయి. ఈ నామినేషన్లను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను ఏకగ్రీవంగా ప్రకటించడం లాంఛనమేనని చెప్పవచ్చు. 


నేడు పరిశీలన

సహకార ఎన్నికల్లో భాగంగా ఆదివారం నామినేషన్లు పరిశీలించనున్నారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. 10న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే నామినేషన్ల ఉప సంహరణ కొనసాగే అవకాశాలున్నాయి. ఆయా సంఘాల పరిధిలో డైరెక్టర్‌ పదవి కోసం జరిగే ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో మరిన్ని నియోజకవర్గాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 28 నియోజకవర్గాల్లో సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే కొందరు పరస్పర అవగాహనతో నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వేశారు. ఇలాంటి వారంతా నామినేషన్ల పరిశీలన తర్వాత ఎవరో ఒకరు మాత్రమే పోటీలో ఉండి మిగతా వాళ్లు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఎస్టీలు, ఎస్సీ మహిళకు కేటాయించిన అనేక నియోజకవర్గాల్లో రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా సంఘాల పరిధిలో ఉప సంహరణలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైర్మన్‌ పదవిని ఆశించి రంగంలో నిలుస్తున్న కొందరు రైతులు కూడా తమ నియోజకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.


సింగిల్‌ నామినేషన్లలో టీఆర్‌ఎస్‌

ఇప్పటి వరకు సింగిల్‌ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సభ్యులే క్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 28 సింగిల్‌ నామినేషన్లు రాగా ఇందులో 20 మందికిపైగా టీఆర్‌ఎస్‌కు సంబంధించిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొందరు స్వతంత్రులుగా చెబుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్‌ సంఘం పరిధిలో 1, దుర్షేడు సంఘం పరిధిలో 2 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే సింగిల్‌ నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం సాయంత్రం ఈ విషయాన్ని మంత్రి గంగుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. జిల్లాలోని మరో మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇల్లందకుంట మండలం మల్యాల సంఘంలో కూడా మరో 3 నియోజకవర్గాల్లో సింగిల్‌ నామినేషన్లు వచ్చాయి. ఇవీ తమ పార్టీ గెలుపునకు శుభసూచికమని మంత్రి గంగుల కమలాకర్‌ అభివర్ణించారు. 


logo