బుధవారం 27 మే 2020
Karimnagar - Feb 09, 2020 , 01:56:09

సత్వర న్యాయం కోసం లోక్‌ అదాలత్‌లు

సత్వర న్యాయం కోసం లోక్‌ అదాలత్‌లు

కరీంనగర్‌ లీగల్‌: లోక్‌ అదాలత్‌ల ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందనీ, కక్షిదారుల డబ్బు, సమయం ఆదాతోపాటు ఇరువర్గాల మధ్య సత్సంబంధాలు కొనసాగించే వాతావరణం ఏర్పడుతుందని మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ ప్రారంభ కార్యక్రమంలో ఆయన కక్షిదారులనుద్దేశించి మాట్లాడుతూ, రాజీయే రాజమార్గమనీ, సత్వర పరిష్కారానికి వేదికలైన లోక్‌ అదాలత్‌లను వినియోగించుకుని కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గల కోర్టుల్లో లోక్‌ అదాలత్‌ కార్యక్రమం జరుగుతుందనీ, కక్షిదారులు రాజీకి యోగ్యమైన కేసులు పరిష్కరించుకోవాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో 809 కేసులు పరిష్కారమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 62 సివిల్‌, 744 క్రిమినల్‌, 11 ప్రీలిటిగేషన్‌ కేసులు పరిష్కరించగా, 41 మోటార్‌ వాహనాల కేసుల్లో రూ.1,98,49,000 పరిహారం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలో ఆరో స్థానం దక్కింది. ఈ కార్యక్రమంలో ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రేమా రాజేశ్వరి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి లలితశివజ్యోతి, 4వ అదనపు జిల్లా జడ్జి మాధవికృష్ణ, డీఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీ సుజయ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్‌తోపాటు న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. 


logo