శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 08, 2020 , 02:21:27

నగరాభివృద్ధే లక్ష్యం

నగరాభివృద్ధే లక్ష్యం

నమస్తే : స్మార్ట్‌సిటీ పనుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

మేయర్‌ : సీఎం కేసీఆర్‌, అప్పటి ఎంపీ వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌ పూర్తి చొరవతోనే కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు ఫలితాలన్నీ వచ్చే ఐదేళ్లలో ప్రజలకు అందేలా కృషి చేస్తాం. రాష్ట్ర, కేంద్రం నుంచి వచ్చే రూ.వెయ్యి కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టు కింద అన్ని రకాల పనులూ చేపడతాం. ముఖ్యంగా నగరంలోని అన్ని అంతర్గత రహదారుల అభివద్ధికి ప్రాధాన్యత ఇస్తాం. ఫాగింగ్‌, స్వీపింగ్‌ యంత్రాలు వంటివి వినియోగించి పారిశుధ్యాన్ని మరింత మెరుగుపర్చుతాం. నగరపాలక సంస్థ కార్యాలయ నిర్వహణకు, మరిన్ని వసతులు కల్పించేందుకు ఈ ప్రాజెక్టులో అవకాశం ఉన్నంత వరకు వినియోగిస్తాం. స్మార్ట్‌సిటీ కింద చేపట్టే పనులు వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ కూడా సూచించారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని పెండింగ్‌లో ఉన్న పనులకు టెండర్లు పూర్తి చేసి వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటాం.

నమస్తే : రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనుల్లో వేగం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

మేయర్‌ : గతంలో ఎప్పుడూ లేని విధంగా నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.347 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.100 కోట్లతో చేపట్టాల్సిన పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలిన రూ.247 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. పార్టీలు అన్న తేడా లేకుండా నగరంలోని 60 డివిజన్లో అభివృద్ధి పనులు చేపడతాం. నగరాభివృద్ధి కోసం ఇప్పటికే మంజూరైన నిధులతో పాటు మరో రూ.వంద కోట్ల నిధులు తీసుకువస్తానని మంత్రి గంగుల కమలాకర్‌ సూచన ప్రాయంగా తెలిపారు. ఈ నిధులను కూడా మున్సిపాలిటీ నుంచే వినియోగించే విధంగా చూస్తాం. 

నమస్తే : బల్దియా ఆదాయం పెంపుకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

మేయర్‌ : నగరపాలక సంస్థ ఆదాయ మార్గాల్లో ఎలాంటి లీకేజీలు లేకుండా పూర్తిస్థాయిలో వాటిని పెంపొందించుకునే విధంగా దృష్టి సారిస్తాం. కొత్తగా ఇంటి నంబర్లను కేటాయించడంతో పాటు, అడ్వర్‌టైజింగ్‌, హోర్డింగ్‌లు, ట్రేడ్‌ లైసెన్స్‌లు పూర్తిస్థాయిలో వసూలయ్యే విధంగా చర్యలు చేపడతాం. వచ్చే ఆదాయం లోటు లేకుండా చూస్తాం.

నమస్తే : గతంలో కౌన్సిల్‌ సమావేశాలు పెద్దగా జరగలేదన్న అపవాదు ఉంది. ఈసారి ఎలా నిర్వహిస్తారు?

మేయర్‌ : ప్రస్తుత పాలకవర్గంలో అత్యధికంగా కొత్తవారే ఉన్నారు. మంత్రి సహకారంతో ప్రతి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తాం. ఇందులో ఆయా డివిజన్ల సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి ఆదేశాలు ఇస్తాం. అధికారులతో సమాధానం ఇచ్చే విధంగా చూస్తాం. రెండు నెలలకోసారి సమావేశాలు జరిగితే అధికారుల్లోనూ జావాబుదారీనతం పెరిగే అవకాశం ఉంటుంది. స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు సకాలంలోనే నిర్వహిస్తాం.

నమస్తే : గతంలో నగరం ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌లో 11వ ర్యాంకు సాధించింది. ఈ సారి ఏ స్థాయికి వచ్చేలా చర్యలు తీసుకుంటారు?

మేయర్‌ : కరీంనగర్‌ను ఆకర్షణీయ, లివింగ్‌ నగరంగా తీర్చిదిద్దుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తాం. దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ సర్వేల్లో నగరానికి మంచి ర్యాంకు వచ్చింది. ఈసారి మెరుగుపర్చుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. గత కొన్నేళ్లుగా స్వచ్ఛసర్వేక్షన్‌, లివింగ్‌ జాబితాల్లో మంచి ఫలితాలను సాధిస్తుంది. ఈ విషయంలో ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలి. ‘మన నగరం కరీంనగర్‌' అనే విధంగా ప్రతి ఒక్కరూ ఈ సర్వేల్లో పాల్గొని దేశంలో గుర్తింపు వచ్చే విధంగా పూర్తి సహకారం అందించాలి. దీని కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతాం.

నమస్తే : పారిశుధ్య మెరుగుదల కోసం తీసుకునే చర్యలు?

మేయర్‌ : దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. అన్ని డివిజన్లలో పారిశుధ్య పనులు సక్రమంగా సాగేలా చూస్తాం. ఇప్పటి వరకు నగరంలో ఎక్కడా మహిళల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. పాలకవర్గ మొదటి సమావేశంలో దీనిపై తీర్మానించి, నిర్మించేలా కృషి చేస్తాం. ముఖ్యంగా వ్యాపార సంస్థలు, ప్రజా రవాణా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తాం. పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు ఆధునిక యంత్రాలను కూడా వినియోగించుకునే తీరులోనే ప్రయత్నాలు చేస్తాం.

నమస్తే : నగరంలో పార్కుల అభివృద్ధి విషయంలో ఎలా ముందుకు వెళ్తారు?

మేయర్‌ : బల్దియా పార్కు స్థలాలన్నింటినీ సంరక్షించి అందులో ఉన్న స్థలాన్ని వినియోగించుకొని అభివృద్ధి చేస్తాం. అన్ని పార్కు స్థలాల్లోనూ పచ్చదనం పెంచడంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేస్తాం. అభివృద్ధిలో ఉన్న పార్కులన్నింటినీ సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కొత్త స్థలాల్లోనూ పార్కుల నిర్మాణానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకంపటాం. మున్సిపల్‌కు సంబంధించి పూర్తిస్థాయిలో ప్లే గ్రౌండ్‌ ఏర్పాటుకు స్థల కోసం మంత్రికి విన్నవిస్తాం. 

నమస్తే : విలీన గ్రామాల అభివృద్ధి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

మేయర్‌ : విలీన గ్రామాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులు  చేపడతాం. ముఖ్యంగా కార్పొరేషన్‌లో కలిసినందుకు న్యాయం జరిగిందన్న విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తాం. మంత్రి గంగుల కమలాకర్‌ సహకారంలో స్థానికంగా చర్చిస్తాం. మంత్రి సూచనలు తీసుకొని ఆయా ప్రాంతాల్లో స్థలం ఉంటే మంచి పార్కులను అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా అక్కడి ప్రజలు సంతోష పడే విధంగా తామ పాలకవర్గం పని చేస్తుంది. 

నమస్తే : బల్దియా కార్యాలయంలో సిబ్బందికి సరైన స్థలం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు. ?

మేయర్‌ : ప్రస్తుతం సిబ్బందికి అనుగుణంగా స్థలం కేటాయింపు లేదు. దీనిపై దృష్టి పెట్టి మంత్రి గంగుల కమలాకర్‌ సహకారంతో కొత్త భవనం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం. కౌన్సిల్‌ సమావేశ మందిరం, మహిళా కార్పొరేటర్ల గది, ఇతర సౌకర్యాలు కల్పించే దిశగా దృష్టి సారిస్తాం. ముఖ్యంగా కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. దీనికి స్మార్ట్‌సిటీ, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులను వినియోగించుకుంటాం. 

నమస్తే :  పాత గెస్ట్‌హౌస్‌లో ప్రాంతంలో షాపింగ్‌ మాల్‌ నిరుపయోగంగా ఉంది. దీని విషయంలో ఏం చేస్తారు?

మేయర్‌ : మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌ స్థలంలో నిర్మించిన భవనానికి ఇప్పటికే పలుసార్లు టెండర్లు నిర్వహించిన వ్యాపారుల నుంచి స్పందన రాలేదు. ఈ విషయంలో దృష్టి పెట్టి వ్యాపారులు ఎందుకు ముందుకు రావడం లేదన్న విషయంలో చర్చిస్తాం. అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటే చేపట్టి సత్వరమే వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. 

నమస్తే :  మీ పాలకవర్గం చేపట్టనున్న కొత్త కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?

మేయర్‌ : ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలను మంత్రి ఆదేశాల మేరకు అమలు చేస్తాం. పాలకవర్గ ఆలోచనల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. పారిశుధ్య మెరుగు, దుమ్ములేని రోడ్లు, దోమలు బెడద లేకుండా చూడడం, పందుల సంచారం లేకుండా చేయ డం, పరిశుభ్రమైన మంచినీటిని అందించడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తాం. సమయానుకూలంగా అవసరమైన అన్ని చర్యలూ కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చించుకొని అమలు చేస్తాం. logo