శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 07, 2020 , 02:01:46

వనం విడిచి జనంలోకి సమ్మక్క

వనం విడిచి జనంలోకి సమ్మక్క
  • కొలువుదీరిన సమ్మక్క
  • జాతరలు జనసంద్రం
  • రెండో రోజు ఎనిమిది లక్షలకుపైగా భక్తులు
  • దర్శనం కోసం బారులు
  • తల్లీబిడ్డలకు బంగారం మొక్కులు
  • దర్శించుకున్న మంత్రి కొప్పుల, ఎమ్మెల్యేలు
  • నేడు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశాలు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: వన దేవతల జాతరల్లో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు చేరుకోగా, గురువారం సాయంత్రం సమ్మక్క కొలువుదీరింది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ కోయపూజారులు వనంలోంచి తోలుకరాగా, కుంకుమభరిణె రూపంలో ఉన్న తల్లి సమ్మక్క సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గద్దెనెక్కింది. భక్తులు జేజేల నడుమ ఎదురుకోళ్లతో తల్లికి స్వాగతం పలికారు. ‘జంపన్న వాగుల్లో అబియా.. జాలారు బండల్లా అబియా.. తల్లి సమ్మవ్వా అబియా.. పదివేల దండాలే అబియా..’ అంటూ శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. కొలువుదీరిన తల్లీబిడ్డలను దర్శించుకునేందుకు ఉదయం నుంచే జాతర ప్రదేశాలకు బారులు తీరారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికిపైగా తరలివచ్చారు. ఒడిబియ్యంతో తరలివచ్చిన మహిళలు, ఇద్దరమ్మలకు కుంకుమ, పసుపు, బంగారం(బెల్లం) సమర్పించి, చల్లంగ చూడాలని వేడుకున్నారు. గురువారం రాత్రి ఆయాచోట్ల నిద్రజేసి, తెల్లారి మొక్కులు అప్పగించాక తిరుగుముఖం పట్టనున్నారు. నేడు పది లక్షల మందికిపైనే రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


దర్శించుకున్న ప్రముఖులు.. 

సమ్మక్క, సారలమ్మలను ప్రముఖులు దర్శించుకున్నారు. రేకుర్తిలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై సునీల్‌రావు దంపతులు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి గద్దెల వద్ద పూజలు చేశారు. మానకొండూర్‌ మండలం దేవంపల్లి, కొండపల్కల, వేగురుపల్లిలో, శంకరపట్నం మండలం కేశవపట్నం, ఆముదాలపల్లిలో, ఇల్లంతకుంటలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ దర్శించుకొని, ఎత్తు బంగారం సమర్పించారు. ధర్మపురి పట్టణ శివారులోని మోరెళ్లవాగు సమీపంలో గల సమ్మక్క గద్దెల వద్ద రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి ఈశ్వర్‌ గురువారం వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. వెల్గటూర్‌ మండలం రాజారాంపల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించారు. 


గొల్లపల్లి మండలం చిల్వకోడూరులో మంత్రి ఈశ్వర్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత ఎత్తు బంగారం సమర్పించి, భక్తులకు పంచారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం నారాయణపూర్‌లో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జూలపల్లి మండలం తేలుకుంట, పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, గోలివాడలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్లలో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి, తేలుకుంటలో గ్రంథాయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, జనగామలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్‌ మూల విజయారెడ్డి దర్శించుకున్నారు.  కాగా, నీరుకుళ్లలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఏర్పాట్లను పరిశీలించారు. కోనరావుపేట మండలం శివంగాళపల్లిలో ఎమ్మెల్యే రమేశ్‌ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి వనదేవతలను దర్శించుకున్నారు. రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. logo