గురువారం 28 మే 2020
Karimnagar - Feb 07, 2020 , 01:58:29

ఆయకట్టు వివరాలు అందించండి

ఆయకట్టు వివరాలు అందించండి

రామడుగు: జిల్లాలోని ఆయకట్టు వివరాలను అందించాలని ఇంజినీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ కే శశాంక ఆదేశించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌ను గురువా రం ఆయన సందర్శిచారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖలోని పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా కాళేశ్వరం ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి మ్యాపుద్వారా కాళేశ్వరం పూర్తి నిర్మాణాలను, ఎఫ్‌ఎఫ్‌సీ ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు వరదకాలువ నిర్మాణం, ఆయకట్టు గురించి కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, అన్ని ప్రాజెక్టుల కింద ఎంత ఆయకట్టు ఉందని అడిగారు. జిల్లాలో మొత్తం ఎన్ని చెరువులున్నాయి?  గత సీజన్‌లో ఎన్ని చెరువులను ఏ విధంగా నింపారని ప్రశ్నించారు. నింపలేని చెరువులను భవిష్యత్తులో ఏ విధంగా నీటిని తరలించవచ్చో ప్రత్యామ్నాయాలు చూడాలని సూచించా రు. ముఖ్యంగా పారకం ద్వారా జిల్లాలో ఏ ప్రాం తాలకు నీరు చేరలేని అవకాశం ఉందని అడిగారు. దీనిపై ఐబీ ఈఈ కరీంనగర్‌ శ్రీకాంత్‌ గుప్తా వివరిస్తూ చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూ ర్‌, కాట్నపల్లి గ్రామాలకు నీరుచేరే అవకాశం లేనందున అక్కడి ప్రజలు, రైతులు గతంలో ఆందోళన చేపట్టారని దృష్టికి తీసుకొచ్చారు. 


దీనిపై పూర్తి సమాచారం కావాలని కలెక్టర్‌ అడిగారు. ఆ గ్రా మాలకు నీరు ఎలా వెళ్లే అవకాశం ఉందో చూడాలన్నారు. కాగా, రామడుగు మండలం వెదిర గ్రా మంలోని నమిళ్ల చెరువుకు వరదకాలువ  ఏర్పా టు చేసిన తూముద్వారా వెళ్లే నీటితో పంటపొలా లు మునుగుతున్నట్లు అక్కడి రైతులు గతంలో ఫి ర్యాదు చేసిన విషయంపై కలెక్టర్‌ అధికారులను ప్రశ్నించారు. పూర్వం నమిళ్ల చెరువుకు ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఒర్రెద్వారా నీరు వెళ్లేదనీ, స్థానిక రైతులు ఆక్రమించడంతో ఎఫ్‌ఎఫ్‌సీ ద్వారా వెళ్లే నీటి ఉధృతికి పొలాలు కొంతమేర మునుగుతున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై దృష్టిసారించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎఫ్‌సీ ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు రామడుగు మండలంలో మోతె రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని చూడగా స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 


దాని స్థానంలో రామడుగు మండలంలోని 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందకు ప్రభుత్వం వరదకాలువకు నాలుగుచోట్ల తూములను ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయి ప్రణాళికలను రూపొందించిందన్నారు.  కాలువల నిర్మాణానికి భూ సేకరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం వాహనాల్లో సొరంగమార్గం ద్వారా సర్వీస్‌బే విభాగానికి చేరుకొని అక్కడినుంచి పంపుఫ్లోర్‌, కంట్రోల్‌రూం, భూగర్భ కాన్ఫరెన్స్‌హాల్‌, బాహుబలి మోటర్లను కలెక్టర్‌ పరిశీలించారు. భూ ఉపరితలానికి చేరుకొని డెలివరీ సిస్టర్న్‌, 400 కేవీ సబ్‌స్టేషన్‌, గ్రావిటీ కాలువలను పరిశీలించారు. ఇక్కడ కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్‌, ఎఫ్‌ఎఫ్‌సీ ఈఈ రాములునాయక్‌, ఐబీ ఈఈ కరీంనగర్‌ శ్రీనివాస్‌గుప్తా, కాళేశ్వరం డీఈఈ గోపాలకృష్ణరావు, ఏఈఈలు రమేశ్‌నాయక్‌, వెంకటేశ్‌నాయక్‌, మెగా ఏజెన్సీ ఏజీఎం రామకృష్ణ, సీనియర్‌ మేనేజర్‌ నగేశ్‌, తాసిల్దార్‌ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 


logo