శనివారం 30 మే 2020
Karimnagar - Feb 06, 2020 , 01:42:40

ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే

ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే
  • రాష్ట్రంలో ‘కరోనా’ ప్రభావం లేదు..
  • విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ నమస్తేతెలంగాణ/హుజూరాబాద్‌ టౌన్‌: సొసైటీలపైన ఎగిరేది గులాబీ జెండానేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. కేసీ క్యాంపులోని ఆయన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని 11 సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందనీ, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని కార్యకర్తల్లో విశ్వాసం నింపారు. ఎన్నికల కోసం కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలనీ, రైతుల కోసం పని చేసే నాయకులను గుర్తించి పోటీలో ఉంచాలని సూచించారు. సాధ్యమైనంత వరకు టీఆర్‌ఎస్‌పార్టీ నుంచి ఒక్కరే బరిలో ఉండేటట్లు చూసుకోవాలని చెప్పారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. గత ఎన్నికల ఫలితాలే మరోసారి పునరావృతమవుతాయని మంత్రి పేర్కొన్నారు. 


ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదనీ, పలువురు అనుమానితులకు పరీక్షలు చేయగా, నిర్ధారణ కాలేదన్నారు. ఈ వైరస్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకే రకంగా ఉంటాయనీ, అనుమానం కలిగితే దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చైనా నుంచి రాష్ర్టానికి వచ్చే వారికి గాంధీ దవాఖానలో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామనీ, దీని కోసం అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రపంచంలో 26 దేశాలకు విస్తరించిన కరోనా.. మనదేశంలో కేరళ రాష్ట్రంలో ముగ్గురికి ఉన్నట్లు నిర్ధారణ  అయ్యిందన్నారు. మన రాష్ట్రంలో కరోనాపై ఒక ప్రత్యేక అధికారి, ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.


కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

క్యాంపు కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు మంత్రి ఈటల రాజేందర్‌ కల్యాణలక్ష్మి కింద మంజూరైన దాదాపు రూ.13లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. అనంతరం టీయూటీఎఫ్‌ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.  జడ్పీ చైర్‌పర్సన్‌ కే విజయ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక-శ్రీనివాస్‌, జడ్పీటీసీలు పడిదం బక్కారెడ్డి, శ్రీరాం శ్యామ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బండ శ్రీనివాస్‌, తుమ్మేటి సమ్మిరెడ్డి, తాసిల్దార్లు బావుసింగ్‌, నారాయణ, డీటీ సందీప్‌, ఆర్‌ఐ సతీశ్‌, తదితరులున్నారు.


logo