శనివారం 30 మే 2020
Karimnagar - Feb 06, 2020 , 01:41:34

కరీంనగర్‌కు సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్ట్‌

కరీంనగర్‌కు సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్ట్‌

కరీంనగర్‌ ప్రతినిధి/కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: నగరపాలక సంస్థ పరిధిలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ ద్వారా సిటీ గ్యాస్‌ పంపిణీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కలెక్టర్‌ కే శశాంక తెలిపారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో నగర మున్సిపల్‌ కమిషనర్‌, ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) అధికారులు, రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లతో సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో 60 వేల ఇళ్లకు పైగా ఉన్నాయనీ, ఈ ఇళ్ల అన్నింటికీ ఐఓసీ ద్వారా పైపులైన్‌తో గ్యాస్‌ పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 8 ఏళ్ల కాల పరిమితి ఉంటుందన్నారు. మొదటి విడుతలో 12.3 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిధిలో పైపులైన్లు వేయనున్నట్లు ఐఓసీ సంస్థ అధికారులు తెలిపారన్నారు. 


దశల వారీగా ఎనిమిదేళ్లలో నగరంలో 100 కిలోమీటర్లు పైపులైన్‌ వేసి, వాటి ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్‌ పంపిణీ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఆర్‌అండ్‌బీ ద్వారా 14.5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి హామీ పథకం కింద రూ. 300 కోట్లకు పైగా నిధులతో అంతర్గత రోడ్లు, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో మూడు ప్యాకేజీల్లో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ప్రధాన రోడ్ల వెంబడి, అంతర్గత రోడ్లలో పైపులైన్లు వేసేందుకు సంబంధించిన మ్యాప్‌లను ఆర్‌అండ్‌బీ, నగరపాలక సంస్థ ఇంజినీర్లు ఐఓసీ అధికారులకు ఇవ్వాలని సూచించారు. ఐఓసీ అధికారులు నగరంలో సర్వే చేసి, గ్యాస్‌ పైపులైన్లు రోడ్లపై ఎక్కడ వేస్తారో మార్కింగ్‌తో ప్రతిపాదనలను వారంలోగా  సమర్పించాలన్నారు. ప్రతిపాదనలను పరిశీలించి రోడ్లకు ఎలాంటి నష్టం జరగకుంటే గ్యాస్‌లైన్లు వేసేందుకు అనుమతి మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఐఓసీ అధికారులు, ఆర్‌అండ్‌బీ, నగరపాలక  అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నగర కమిషనర్‌ క్రాంతి, ఎస్‌ఈ భద్రయ్య, రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈ రాఘవచారి, ఈఈ వెంకటరమణ, ఐఓసీ సంస్థ చీఫ్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు బీ శరత్‌, జగదీశ్‌, తదితరులు పాల్గొన్నారు.


పనులు ప్రారంభించాలి..

జిల్లాలో మంజూరైన డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ కే శశాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి అన్ని మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పనుల ప్రగతిపై సమీక్షించారు.   కలెక్టర్‌ మాట్లాడుతూ, భూములు అప్పగించిన అన్ని గ్రామాల్లో వెంటనే వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల పనులకు మార్కింగ్‌ ఇచ్చి, పనులు ప్రారంభించాలన్నారు. సమస్యలుంటే ఆర్డీవోలు, డీఈలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలతో కలిసి గ్రామాలకు వెళ్లి సర్పంచ్‌లతో మాట్లాడి, పరిష్కరించాలన్నారు.   ప్రభుత్వ భూములు లేకుంటే సంబంధిత  తాసిల్దార్లు ఆర్డీవోల ద్వారా సర్టిఫికెట్‌ పంపించాలన్నారు. స్థలాలు ఇచ్చే దాతలను గుర్తించి, భూమిని సేకరించాలన్నారు. ఎస్సారెస్పీ భూములుంటే అధికారులను సంప్రదించి, నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. మిగిలిన గ్రామపంచాయతీల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు వెంటనే తీర్మానాలు పంపించాలన్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌ రాజర్షిషా, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, పంచాయతీరాజ్‌ ఈఈ విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రఘువరణ్‌, తదితరులున్నారు. 


logo