గురువారం 28 మే 2020
Karimnagar - Feb 06, 2020 , 01:35:54

వృద్ధుల సమస్యల పరిష్కారానికి ఎల్డర్‌స్ప్రింగ్‌

వృద్ధుల సమస్యల పరిష్కారానికి ఎల్డర్‌స్ప్రింగ్‌

సుభాష్‌నగర్‌: జిల్లాలోని వయో వృద్ధుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమానికి టాటా ట్రస్ట్‌ సహకారంతో ‘ఎల్డర్‌ స్ప్రింగ్‌' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా ప్రత్యేక అధికారి రాజర్షిషా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎల్డర్‌ స్ప్రింగ్‌ టాటా ట్రస్ట్‌ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఎల్డర్‌ స్ప్రింగ్‌ కార్యక్రమం ద్వారా వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ 14567 ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ  కార్యక్రమం ద్వారా వృద్ధులతో మాట్లాడడం, సలహాలు ఇవ్వడం, వృద్ధుల రక్షణ కోసం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. జిల్లాలో నిరాధరణకు గురైన 60 ఏళ్ల వయస్సు పై బడిన వృద్ధుల సమస్యలు తెలుసుకొని, న్యాయ సలహాలు అందిస్తామన్నారు. ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే అధికారి స్పందించి, సమస్యలు తెలుసుకుని న్యాయ సహాయం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఒకే వేదికపై అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందన్నారు.


వయో వృద్ధుల చట్టం-2007 ప్రకారం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. వయో వృద్ధులకు కుటుంబం నుంచి ఆదరణ కరువైతే కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఆర్డీవోల ద్వారా తగిన న్యాయం చేస్తామని చెప్పారు.  అనంతరం ‘వయస్సు ఎప్పుడూ భారం కాదు-సంతోషం ఎప్పుడూ దూరం కాదు’ అని పేర్కొన్న పోస్టర్లను అవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుజాత, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ బాల సురేందర్‌, ఎల్డర్‌ స్ప్రింగ్‌ సిస్టం మేనేజర్‌ రాజు-కిశోర్‌, లీగల్‌ అడ్వైజర్‌ స్పందన, ఫీల్డ్‌ రెస్పాన్స్‌ ఆఫీసర్‌ శ్రీలత, వయో వృద్ధులు మోహన్‌రెడ్డి, సముద్రాల జనార్దన్‌, పెండియాల కేశవరెడ్డి పాల్గొన్నారు. 


logo