గురువారం 28 మే 2020
Karimnagar - Feb 05, 2020 , 02:21:50

హుజూరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతా

హుజూరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతా

హుజూరాబాద్‌,నమస్తేతెలంగాణ/టౌన్‌:  హుజూరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన మున్సిపల్‌ విజయోత్సవ ర్యాలీ, మొదటి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్‌ చౌరస్తా నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. పూల వర్షం, పటాకల మోతతో పట్టణంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ గందె రాధిక ఆధ్వర్యంలో కొత్తపాలకవర్గం మంత్రి ఈటలను గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పదవులు ప్రజలు ఇచ్చిన భిక్ష అనీ, వారికి ఎల్లవేళలా రుణపడి ఉండాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలుగా కన్నా కౌన్సిలర్‌గా గెలవడం చాలా కష్టమనీ, వార్డు ప్రజల మనస్సులో స్థానం సంపాదించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 


ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. నాలుగైదు నెలల్లో మిషన్‌ భగీరథ నీళ్లు ఇంటింటికీ అందిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌రూం అందజేస్తామనీ, పాపారావుబొంద వద్ద గల చిరు వ్యాపారులకు శాశ్వత నిర్మాణాలు చేపడుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆపదలో పెద్ద కొడుకు పాత్ర పోషిస్తానన్నారు. ప్రజల దీవెనలతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాననీ, వారి రుణం తీర్చుకుంటానన్నారు.  ప్రజలు మెచ్చే తీరులో పాలన కొనసాగించాలని నూతన పాలకవర్గానికి సూచించారు.  హుజూరాబాద్‌ ఏరియా దవాఖానలో ట్రామా సెంటర్‌, ఐసీయూ, డయాలసిస్‌ సెంటర్‌తోపాటు ఇతర వైద్య సేవల కోసం రూ.10 కోట్లు వెచ్చించామన్నారు. దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు అందించి, పేదలకు రూపాయి ఖర్చు కాకుండా చూడడమే తన ధ్యేయమనీ, ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రిని చిరువ్యాపారులు, పలువురు పట్టణ ప్రజలు, అభిమానులు సన్మానించారు.


మొదటి సమావేశంలో తీర్మానాలు..

మొదటి సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరుకాగా, నూతన పాలకవర్గం  పలు తీర్మానాలు చేసింది. పట్టణంలో తీవ్ర కోతుల బెడద ఉండగా, దాని నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మొదటి తీర్మానం చేశారు. మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్‌, తాగునీటి బావులు, పైప్‌లైన్ల మరమ్మతు వీధి దీపాల నిర్వహణ మెరుగు కోసం తీర్మానాలు  చేసినట్లు చైర్‌పర్సన్‌ రాధిక తెలిపారు. కొత్త పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  చైర్‌పర్సన్‌ రాధికను మంత్రి సన్మానించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కే విజయ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, జమ్మికుంట చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల-శ్రీనివాస్‌, మార్కెట్‌ చైర్మన్‌ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, కమిషనర్‌ ఈసంపెల్లి జోన, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


logo