శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 05, 2020 , 02:20:36

ప్రజల నమ్మకాన్ని వమ్ముకానివ్వం

ప్రజల నమ్మకాన్ని వమ్ముకానివ్వం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ మున్సిపల్‌ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ పార్టీని మొదటిసారిగా సృష్టమైన మెజార్టీతో గెలిపించారనీ, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాకుండా పని చేస్తామని నగర మేయర్‌ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక శ్వేత హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమకు అత్యధిక మెజార్టీతో అధికారాన్ని అప్పగించిన నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో నగర అభివృద్ధికి ఎప్పుడూ లేనివిధంగా వందల కోట్ల నిధులు మంజూరయ్యాయనీ, వాటితో నగర సుందరీకరణ పనులు సాగుతున్నాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో సమష్టి  కృషితో మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ సూచనలతో ప్రజలకు అభివృద్ధ్ది, సంక్షేమాన్ని   అందిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా వివిధ డివిజన్ల ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్‌ ఇచ్చిన హామీలన్నింటినీ తప్పనిసరిగా పూర్తి చేస్తామని తెలిపారు. 


ప్రస్తుతం వచ్చిన నిధులతోపాటు నగరాభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ప్రజల అవసరాల మేరకు అభివృద్ధ్ది పనులు సాగిస్తామని మేయర్‌ సునీల్‌రావు తెలిపారు. పాలకవర్గ సభ్యులతో ప్రతి రెండు నెలలకొకసారి సమావేశం నిర్వహిస్తామనీ, అధికారుల్లో జవాబుదారీతనం పెరిగే విధంగా చూస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పరిశుభ్రత విషయంలోనూ ప్రత్యేకంగా దృష్టి పెడుతామని చెప్పారు. గత పార్టీలు ఏవీ కూడా బల్దియా అభివృద్ధిని పట్టించుకోలేదనీ, మున్సిపల్‌ నిధులు తప్ప ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చింది లేదన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ హయాంలో పెద్ద  మొత్తంలో నిధులు తీసుకువచ్చి పనులు చేపడుతున్నామన్నారు. స్మార్ట్‌సిటీ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న టెండర్లను సత్వరమే పూర్తి చేసి, పనులు కూడా వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు. నగరపాలక సంస్థకు ఇప్పటి వరకు ఒక్క ప్లే గ్రౌండ్‌ కూడా లేదనీ, మంత్రి గంగుల కమలాకర్‌ ద్వారా నగరపాలక సంస్థకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించుకొని, ఓ మంచి ప్లే గ్రౌండ్‌ను తమ ఆధ్వర్యంలో నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించి పనులు చేస్తామన్నారు. నగర ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తామనీ, అవినీతికి తావు లేకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం తీసుకువచ్చిందన్నారు. 


అయినా వీటిల్లోనూ అధికారులు పలు పనులు పెండింగ్‌లో పెడుతున్నారనీ, వీటి పరిష్కారానికి ఓ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. వీధివ్యాపారుల కోసం కూడా అన్ని చర్యలు చేపడుతామన్నారు. కూరగాయల మార్కెట్లను విస్తరిస్తామనీ, ఇప్పటికే పూర్తయిన వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. ఈనెల 8న తాను మేయర్‌గా బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బల్దియా ఆవరణలోనే పబ్లిక్‌ మీటింగ్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కార్పొరేటర్లు వాల రమణారావు, చాడకొండ బుచ్చిరెడ్డి, గందె మాధవి మహేశ్‌, సరిళ్ల ప్రసాద్‌, నేతికుంట యాదయ్య, భూమాగౌడ్‌, సాగర్‌ పాల్గొన్నారు. 


logo