గురువారం 28 మే 2020
Karimnagar - Feb 04, 2020 , 01:39:08

శోభాయమానం

శోభాయమానం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : తిరుమలను తలపించే రీతిలో కరీంనగర్‌లో జరిగిన వేంకటేశ్వరుడి శోభాయాత్ర ఆద్యంతం మంత్ర ముగ్దుల్ని చేసింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీవారి రాజసం ఉట్టిపడగా.. సుగంధ పరిమళ పుష్పాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. మార్క్‌ఫెడ్‌ నుంచి ప్రారంభమైన యాత్ర మంకమ్మతోట, తెలంగాణ చౌక్‌, బస్టాండ్‌, ఎస్పీ కార్యాలయం, రాజీవ్‌చౌక్‌, టవర్‌సర్కిల్‌ మీదుగా ఆలయానికి చేరుకుంది. గోగుల ఈవెంట్‌ గోగుల ప్రసాద్‌ ఆధ్వర్యంలో శ్రీవారి వాహనాలైన శేష, చంద్ర, సూర్య, కల్పవృక్ష, గజ, గరడ, సింహ, అశ్వ, హనుమద్వాహనాలతో పాటు 8 గుర్రాలు, సింగారి మేళం, నాలుగు కావడిలు, తిరుమల నుంచి నరసింహావతారం, కేరళ తయ్యం, దశావతరాలు, కేరళ డప్పువాయ్యిదం, 200 మంది చామనపెల్లి కోలాటం బృందం, చిరుతల రామాయణం, ఒగ్గుడోలు కళాకారులు, చిన్నారుల దేవతారూపాలు, కోలాటం, సుమారు వెయ్యి మంది గోవిందపతి శ్రీవారి సేవా సమితి బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దారిపొడవునా అంబులెన్స్‌, పోలీసు వాహనాలు ఏర్పాటు చేశారు. వాహనశ్రేణి వెనుక వివిధ అలంకరణల మధ్య ఉభయ దేవరులతో సర్వాలంకారభూషితుడైన శ్రీవారు భక్తులకు కనువిందు చేశారు. పలు స్వచ్ఛంద, ఆధ్యాత్మిక, ధార్మిక సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రసాదం, మంచినీరు, మజ్జిగ వితరణ చేశారు. మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, టీఆర్‌ఎస్‌ నాయకులు విజయేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్‌రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

దారి పొడవునా స్వాగతం

శోభాయాత్రకు మహిళలు దారిపొడవునా మంగళహారతులతో స్వాగతం పలికారు.  భజనలు, గోవిందనామస్మరణలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. 

ప్రత్యేక ఆకర్షణగా గజరాజు

శోభయాత్రలో కర్ణాటక నుంచి తీసుకువచ్చిన గజరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందు వరుస లో గజరాజు గాంభీర్యం సాగగా.. అశ్వాలు.. వివిధ కళాకారులు, డప్పువాయిద్యాలు, ప్రత్యేక రథంపై స్వామి వారు భక్తులకు కనువిందు చేశారు.


logo