బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 04, 2020 , 01:37:13

పచ్చదనంతోనే వాతావరణ సమతుల్యత

పచ్చదనంతోనే వాతావరణ సమతుల్యత

కరీంనగర్‌ క్రైం : పచ్చదనం పెంపుతోనే వాతావరణ సమతుల్యత సాధ్యమనీ, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో చిట్టడవులను పెంచడం కోసం కరీంనగర్‌ పోలీస్‌శాఖ మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టగా, కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. సిటీ పోలీస్‌శిక్షణ కేంద్రంలో ఉన్న ఎకరం విస్తీర్ణంలో 12,500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడుతూ వాతావరణ సమతుల్యత లోపించడం వల్ల విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణకు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే మియావాకీ పద్ధతి మేలైందన్నారు. ఒకప్పుడు కల్లోలిత జిల్లాగా పేరు పొందిన కరీంనగర్‌లో పోలీసులు లాఠీ తూటాలకే పరిమితమయ్యారని, తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడి శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమైందన్నారు. ప్రజాహిత కార్యక్రమాల వల్లే నేరాలు నియంత్రణలోకి వచ్చాయన్నారు. ప్రజల భద్రత, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యల్లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆదర్శనీయమన్నారు. దేశ వ్యాప్తంగా భద్రతా పరంగా కరీంనగర్‌ను నాలుగో స్థానంలో నిలిపిన ఘనత సీపీదేనన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతుందని, ఇప్పటికే స్మార్ట్‌ సిటీ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. దేశ విదేశ సంస్థలు కరీంనగర్‌కు రానున్నాయని, దీనికి కరీంనగర్‌ సేఫ్‌ సిటీగా ఉండడమే కారణమన్నారు. అనంతరం సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడం వల్లే ప్రజలతో సత్సంబంధాలు పెంపొందాయన్నారు. 2018లో 25వేల మొక్కలు నాటేందుకు సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చి 90 శాతం మొక్కలు రక్షించామన్నారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచేందుకు జపాన్‌ శాస్త్రవేత్త మియావాకీ సూచించిన పద్ధతిని అనుసరించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. హరితహారం కార్యక్రమం సందర్భంగా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఇప్పటికే 15వేల మొక్కలు చెట్లుగా పెరిగాయని తెలిపారు. ప్రతి వ్యక్తి పర్యావరణం కోసం కనీసం పది మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, కార్పొరేటర్లు ఐలేందర్‌ యాదవ్‌, రమణారావు, సీపీటీసీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ శివభాస్కర్‌, ఏసీపీలు పీ అశోక్‌, శంకర్‌రాజు, ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్‌, దేవారెడ్డి, విజ్ఞాన్‌రావు, తుల శ్రీనివాస్‌రావు, దామోదర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, శాంతి సంక్షేమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.logo