బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 04, 2020 , 01:33:57

భూ సర్వే వేగవంతం చేయాలి

భూ సర్వే వేగవంతం చేయాలి

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/:కరీంనగర్‌ హెల్త్‌: ప్రభుత్వ భూములు, సేత్వార్‌ ప్రాంతాల పరిశీలనను వేగవంతం చేయాలనీ, ఫిబ్రవరి చివరికల్లా సర్వే పూర్తి చేయాలని జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ సూచించారు.  కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో జిల్లాలోని సర్వేయర్లతో సర్వే పనులపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములు, సేత్వార్‌ ప్రాంతాల పరిశీలన పూర్తి చేసి గ్రామాల వారీగా వేర్వేరు కలర్లతో మ్యాపులు తయారు చేయాలని ఆదేశించారు.  ప్రభుత్వ అభివృద్ధి పనులకు సేకరించాల్సిన భూముల సర్వేను పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు తమ భూములు సర్వే చేసేందుకు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, వారి భూ సర్వే పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో భూమి కొలతలు, రికార్డుల సహాయ సంచాలకుడు ఆర్‌. అశోక్‌, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్లు బీ సేవ్యా, జే గణేష్‌, ఏ రవీంద్రాచారి, సర్వేయర్లు పాల్గొన్నారు.

నులి పురుగులను నిర్మూలిద్దాం

నులిపురుగులను నిర్మూలించి, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేలా కృషిచేద్దామని జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ పేర్కొన్నారు. ఈ నెల 10న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జేసీ మాట్లాడుతూ, నులిపురుగులున్న పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, బలహీనత, వికారం, వాంతులు, బరువు తగ్గడం, అతిసారంలాంటి అనారోగ్య సమస్యలుంటాయన్నారు. ఈ నెల 10న  1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 1 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 6 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలను వేస్తామని తెలిపారు. పాఠశాలలకు వెళ్లని పిల్లలు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో నివసించే పిల్లలకు కూడా ఈ మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు.  నులిపురుగుల నిర్మూలన మాత్రలపై తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపాలిటీల పరిధిలో స్వశక్తి సంఘ మహిళలతో సమావేశాలు నిర్వహించి, జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత, జిల్లా సంక్షేమ అధికారి శారద, ఎస్సీ కులాల సంక్షేమశాఖ ఉప సంచాలకుడు బాల సురేందర్‌, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ వసంతరావు, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, డాక్టర్‌ జువేరియా, మెడికల్‌ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.logo