ఆదివారం 31 మే 2020
Karimnagar - Feb 04, 2020 , 01:33:29

జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలోనే అత్యధిక మంది భక్తులు సందర్శించే రేకుర్తి సమ్మక్క-సారలమ్మ జాతర వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. సోమవారం రేకుర్తి వద్ద చేపడుతున్న ఏర్పాట్లను మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేకుర్తి వద్ద నిర్వహించే జాతరకు 3 లక్షల నుంచి 4.50 లక్షల వరకు భక్తులు వస్తారన్నారు. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. భక్తుల కోసం క్యూలైన్లతో పాటు, మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా 20 చొప్పున మరుగుదొడ్ల నిర్మాణం చేశామన్నారు. ఎస్సారెస్పీ కాల్వలో నీటి విడుదల చేశామన్నారు. స్నానాలు చేయడానికి ప్రత్యేకంగా షవర్ల ఏర్పాటు, మహిళలు వస్ర్తాలు మార్చుకోవటానికి గదుల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకు భారీగా పోలీసు బందోబస్తు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండారి వేణు, వాల రమణారావు, మాధవి, రాజశేఖర్‌, నాయకులు చల్ల హరిశంకర్‌, నందెల్లి ప్రకాశ్‌, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, సూర్యశేఖర్‌, సంపత్‌రావు, జాతర వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


logo