శనివారం 30 మే 2020
Karimnagar - Feb 03, 2020 , 04:12:31

సహకార ‘రణం’

సహకార ‘రణం’
  • నేడే సింగిల్‌ విండోల్లో నోటీసులు
  • ముమ్మరంగా ఏర్పాట్లు
  • ప్రతి సంఘానికి ఒక ఎన్నికల అధికారి


 (కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. జిల్లాలో 30 సంఘాల్లో ఎన్నికలకు అధికారులు సోమవారం నోటీసు జారీ చేయనున్నారు. ఇందుకు ఒక్కో సంఘానికి ఒక్కో ఎన్నికల అధికారిని నియమించారు. వీరు నోటీసులు జారీ చేసిన తర్వాత ఓటరు జాబితాను అందుబాటులో ఉంచుతారు. సంఘం పరిధిలోని నియోజకవర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా ప్రకటిస్తారు. ఈ మేరకు రిజర్వేషన్‌ ప్రక్రియను ఇప్పటికే జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఆయా సంఘాల పరిధిలో 12 నుంచి 13 నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ శశాంక ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి సీహెచ్‌ మనోజ్‌కుమార్‌ నేతృత్వంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ వేగంగా జరుగుతున్నాయి. జిల్లా సహకార కార్యాలయంలో ఆదివారం కూడా విధుల్లో ఉండి పనులు చక్కబెడుతున్నారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా సరిచేయడంతోపాటు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఈ జాబితాను ఆయా సంఘాలకు నియమించిన ఎన్నికల అధికారులకు అందిస్తారు.


52,201 మంది ఓటుహక్కు

జిల్లాలో మొత్తం 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా వీటిలో 79,324 మంది సభ్యులు ఉన్నారు. అయితే వాటాధనం కలిగిన సభ్యులకు మాత్రమే సంఘాల్లో ఓటు హక్కు కల్పిస్తారు. జిల్లాలో తుది జాబితా ప్రకారం 52,201 మంది సభ్యులు ఆయా సంఘాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. అత్యధికంగా సైదాపూర్‌ సంఘ సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో 4,859 మంది సభ్యులు ఉండగా 4,654 మందికి ఓటు హక్కు ఉంది. వీణవంక సహకార సంఘం ఆ తర్వాత స్థానంలో ఉంది. ఈ సంఘంలో చూస్తే 6,300 మంది సభ్యులు ఉన్నారు. 3,623 మందికి ఓటు హక్కు ఉంది. 


ఎన్నికల అధికారులు వీరే.. 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులను నియమించారు. బీ సత్యం (కరీంనగర్‌), ఎం. శంకరయ్య (దుర్శేడ్‌), జయప్రకాశ్‌ (మానకొండూర్‌), పీ దేవదాసు (గట్టుదుద్దెనపల్లి), పీ కృష్ణగోపాల్‌ (దేవంపల్లి), ఎం. రాజిరెడ్డి (ఊటూర్‌), జే సురేందర్‌ (పోరండ్ల), ఎం. వెంకటేశ్వర్లు (నుస్తులాపూర్‌), కే రాజేందర్‌ (చొప్పదండి), జీ అశోక్‌ (ఆర్నకొండ), ఎన్‌. నవీన్‌కుమార్‌ (గంగాధర), పీ ప్రభాకర్‌రావు (కురిక్యాల), వీ రాజిరెడ్డి (రామడుగు), మోహన్‌ (కొక్కెరకుంట), కే రంజిత్‌కుమార్‌ (చిగురుమామిడి), ఎన్‌. నర్సింహారెడ్డి (వీణవంక), టీ విష్ణుకుమార్‌ (హుజూరాబాద్‌), ఎం. మహేందర్‌రెడ్డి (తాడికల్‌), వీ సమ్మయ్య (సైదాపూర్‌), రఘుపతిరెడ్డి (తనుగుల), బీ కృష్ణారావు (మల్యాల), బీ వెంకటేశ్వర్‌రావు (వెన్నంపల్లి), జీ సమ్మిరెడ్డి (బోగంపాడు), జీ సదానందం (ధర్మారం), జీ గణేశ్‌ (జమ్మికుంట), ఆర్‌. శ్రీనివాస్‌ (గద్దపాక), ఆర్‌. శ్రీనివాస్‌- ఎంఏవో (మెట్‌పల్లి), కే రాములు (జూపాక), కాళిదాసు (తుమ్మనపల్లి), జీ జయరాజ్‌ (ఇల్లందకుంట)కు బాధ్యతలు అప్పగించారు.


ఎన్నిల అధికారులకు శిక్షణ.. 

సహకార ఎన్నికలు నిర్వహించేందుకు నియమితులైన అధికారులకు ఆదివారం కేడీసీసీబీలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ మాట్లాడుతూ, ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో జిల్లాకు మంచి పేరుందనీ, సహకార ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి మరింత మంచి పేరు తేవాలని కోరారు. సహకార అధికారి సీహెచ్‌ మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మాస్టర్‌ ట్రైనర్‌ డీటీవో శ్రీనివాస్‌ శిక్షణ ఇచ్చారు. ఎన్నికల అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావుతోపాటు అధికారులు పాల్గొన్నారు.. logo