బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 02, 2020 , 01:48:43

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా
  • దేశానికే ఆదర్శంగా రాష్ట్రం
  • లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ
  • మంత్రి గంగుల కమలాకర్‌
  • అన్నదాతలకు పెద్దపీట

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: నిరుపేదలను ఆదుకొని అండగా నిలవాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.  కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 96 మంది లబ్ధిదారులకు రూ. 93.38 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.  మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. సమైక్య పాలనలో పేదింటి ఆబిడ్దల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు ఎన్నో అవస్థలు పడ్డారనీ, స్వరాష్ట్రంలో అలాంటి కష్టాలు రావొద్దనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆడబిడ్డల పెళ్లిళ్లకు మేనమామలా   రూ.లక్ష అందిస్తున్నారని పేర్కొన్నారు.  


రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా పథకాలు రూపొందించి, పకడ్బందీగా అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంటుతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని  కూడా అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే, ‘రైతు బంధు’ ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు వివరించారు.  కరీంనగర్‌ నియోజకవర్గంలోనే అత్యధికంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. ప్రజల అండతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, కార్పొరేటర్లు కుర్ర తిరుపతి, బుచ్చిరెడ్డి, వాల రమణారావు, భూమాగౌడ్‌, మహేశ్‌, నాయకులు చల్ల హరిశంకర్‌, తిరుపతినాయక్‌ పాల్గొన్నారు. 


logo