బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 02, 2020 , 01:47:30

సేవా గుణం గొప్పది

సేవా గుణం గొప్పది
  • ప్రతిమ ఫౌండేషన్‌, హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ సంస్థలు సమాజానికి ఆదర్శనీయం
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • చిన్నారుల గుండె శస్త్ర చికిత్స శిబిరాలను విస్తరించాలి

కరీంనగర్‌ రూరల్‌: పేదలకు సేవ చేయడం గొప్ప గుణమనీ, గుండె వ్యాధులతో బాధపడే నిరుపేద చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తూ ప్రతిమ ఫౌండేషన్‌, హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌, లండన్‌ సంస్థలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌రూరల్‌ మండలం నగునూర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాలలో ప్రతిమ ఫౌండేషన్‌, హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌, లండన్‌ సంయుక్త ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి నిర్వహిస్తున్న చిన్నపిల్లల గుండె వ్యాధుల శస్త్రచికిత్స ఆరో శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ఈటల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల ఉచిత గుండె శస్త్ర చికిత్స శిబిరాలను ఒకే ప్రాంతానికి కాకుండా వివిధ ప్రాంతాలకు విస్తరించాలని కోరారు.  90 మంది పేదపిల్లలకు లండన్‌ వైద్యులు రమణ దన్నమనేని ఆధ్వర్యంలో వైద్య బృందం ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి పునర్జన్మనివ్వడం గొప్ప విషయమన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు రావాలని కోరారు. ప్రతిమ వైద్యశాలకు మంచి పేరుందనీ, ఈ కళాశాలలో చదివే విద్యార్థులు డాక్టర్‌గా పరిమితం కావాలనే ఉద్దేశంతో లేరనీ, సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లుగా పేరుతెచ్చుకోవాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారని అభినందించారు. 


వైద్య కళాశాలలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అవగాహన పెరుగుతుందన్నారు. డాక్టర్‌ రమణ దన్నమనేని తెలంగాణ రాష్ట్రంపై అభిమానం, తాను పుట్టి పెరిగిన జిల్లా మీద మమకారంతో అమెరికా నుంచి వచ్చి గుండె వ్యాధులతో బాధపడే చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం చూసి చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. పేదలకు సేవ చేయాలనే తపన ఆయన గొప్పతనానికి నిదర్శనమని ప్రశంసించారు. డాక్టర్‌ రమణ దన్నమనేని మాట్లాడుతూ చిన్నారుల గుండె శస్త్ర చికిత్స శిబిరం టీం వర్క్‌గా సాగుతున్నదనీ, ఇప్పటికి 6 క్యాంపులు పూర్తి చేశామని తెలిపారు.ఐదు శిబిరాల్లో 72 మందికి, ఆరో క్యాంపులో 10 మంది వైద్య బృందంతో మరో 18 మందితో కలిపి మొత్తంగా 90 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ రాష్ట్రంలో గుండె వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించాలనే మంచి ఆలోచనతో లండన్‌కు చెందిన హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ సంస్థతో ప్రతిమ ఫౌండేషన్‌ ద్వారా ఈ శస్త్ర చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో 750 మంది చిన్న పిల్లలకు గుండె వ్యాధుల నిర్ధారణ చేసినట్లు చెప్పారు. ప్రతిమ వైద్యశాల సీఈవో రాంచంద్రరావు మాట్లాడుతూ ప్రతిమ వైద్యశాలలో 600కు పైగా గుండె శస్త్ర చికిత్సలు జరిగాయని తెలిపారు. అనంతరం శస్త్రచికిత్స జరిగిన చిన్నారులను బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, నగర మేయర్‌ వై సునీల్‌రావు, వైద్యశాల డీన్‌ డాక్టర్‌ వివేకానంద, డాక్టర్‌ రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, కోడూరి సత్యనారాయణ గౌడ్‌, డాక్టర్‌ జాన్‌ ఇజ్రాయిల్‌, వైద్యబృందం సభ్యులు పాల్గొన్నారు


logo